గుండెపోటు రాకుండా గుండెను కాపాడే ఇంటి చిట్కా అంటూ వెల్లుల్లి గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. మరి నిజానికి వెల్లుల్లికి అన్నీ గుణాలు ఉన్నాయా?.. అసలు నిజం ఏంటి?.. ఆరోగ్యానికి వెల్లుల్లి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషికి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో వెల్లుల్లి పాత్ర మరవలేనిదని అంటారు.. కొన్ని వ్యాధుల నివారణకు సూచిస్తారు.. అయితే వెల్లుల్లి గుండెపోటును పూర్తిగా నివారించే మందు కాదు కానీ ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కొంత మేలు చేసే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
వెల్లుల్లిలో అల్లిసిన్‌తో పాటు పలు సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వెల్లుల్లిని కోసినప్పుడు లేదా నూరినప్పుడు ఏర్పడతాయి. కొన్ని అధ్యయనాల్లో వెల్లుల్లి, ముఖ్యంగా వెల్లుల్లి సప్లిమెంట్లు, అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీని స్వల్పంగా తగ్గించడంలో సహాయపడినట్లు తేలింది. అయితే బీపీ మందులకు వెల్లుల్లి ప్రత్యామ్నాయం మాత్రం కాదు.
అలాగే, అధిక కొలెస్ట్రాల్ ఉన్న కొందరిలో వెల్లుల్లి మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అయిన LDL స్థాయిలను కొంతమేర తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ ఈ ప్రభావం సాధారణంగా పరిమితంగానే ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించిన కొలెస్ట్రాల్ మందులను ఆపేసి వెల్లుల్లిపైనే ఆధారపడటం ప్రమాదకరం అంటున్నారు.
ఇక వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే.. వెల్లుల్లిని కూరల్లో, పప్పుల్లో, ఇతర వంటల్లో సాధారణ ఆహారంగా చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక అంటున్నారు.
అయితే పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు మంట, వికారం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రక్తం పలుచన చేసే మందులు, లేదా ఆస్పిరిన్ వంటి మందులు వాడేవారు వెల్లుల్లి సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలని.. లేకుంటే రక్తస్రావం ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే గుండెపోటు రాదని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదని సూచిస్తున్నారు..
మరోవైపు గుండెను కాపాడుకోవాలంటే సమతుల్య ఆహారం, ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం, బీపీ-కొలెస్ట్రాల్ నియంత్రణ, పొగతాగడం మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుచున్నారు. ఇక గుండె జబ్బులకు చికిత్స కాదు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లని చెమటలు లేదా అకస్మాత్తుగా అసౌకర్యం ఉంటే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












