TG Politics: తెలంగాణ శాసనసభలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తన వైఫల్యాలను, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పథకం ప్రకారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, 6 గ్యారెంటీల అమలుపై నిలదీస్తామనే భయంతోనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో సస్పెన్షన్ డ్రామా..
రాహుల్ గాంధీ లోక్‌సభకు టీ-షర్టులు, స్టిక్కర్లతో వెళ్తే తప్పులేదు కానీ, ప్రజా సమస్యలను టీ-షర్టులపై రాసుకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బూతు పదాలంటూ సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి సాయం, విద్యార్థులకు భరోసా కార్డులు ఎగ్గొట్టిన పాపాలను ప్రశ్నిస్తామనే భయంతోనే తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు.
సభలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగితే.. కనీసం మైక్ ఇవ్వాలని కోరినందుకు మహిళా ప్రజాప్రతినిధులపై కూడా సస్పెన్షన్ వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేస్తే తాము ఆధారాలతో సభకు వస్తామని సవాల్ విసిరినా, సీపీఐ, బీజేపీలు కోరినా సీఎంకి ఆ ధైర్యం లేకపోయిందన్నారు.
22Aపై ఆరోపణలు నిజమని సీఎం ఒప్పుకున్నారు..
22A నిషేధిత భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం అక్షర సత్యమని సీఎం అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 3.71 లక్షల ఎకరాల నిషేధిత భూముల సమస్యను ఏకంగా 30 లక్షల ఎకరాలకు పెంచేసి లక్షలాది కుటుంబాల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ఒకవైపు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్క ఎకరం కూడా చేర్చలేదని చెబితే, అధికారులే 30 లక్షల ఎకరాలు అప్‌లోడ్ చేశారని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక అసలు రహస్యమేంటని నిలదీశారు.
కలెక్టర్లు పాత జాబితాను గుడ్డిగా అప్‌లోడ్ చేసి, ప్రభుత్వం గతంలో వేలం వేసిన హెచ్ఎండీఏ, యూఎల్‌సీ భూములను కూడా 22Aలో పెట్టి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారని సీఎం స్వయంగా ఒప్పుకున్నారన్నారు. "ముఖ్యమంత్రి ఇల్లు రాత్రికి రాత్రే 22A జాబితా నుంచి ఎలా మాయమైంది? చట్టం సీఎంతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఒకేలా వర్తించాలి. కమిటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం" అని విమర్శించారు. ఈ వ్యవహారంలో 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌పై విషం.. రేవంత్ ఫ్యామిలీ చేతుల్లో 308 ఎకరాలు!
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫాంహౌస్ ఉందని తప్పుడు ప్రచారం చేసి, ఇప్పుడు 67 ఎకరాలని మాట మార్చారని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివరాలను హరీశ్‌రావు బయటపెట్టారు. "రేవంత్ రెడ్డి, ఆయన కుమార్తె, తమ్ముళ్ల పేరిట ఏకంగా 308 ఎకరాల భూములు ఉన్నాయి. ఒక్క కొట్రా గ్రామంలోనే 300 ఎకరాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతుంటే, అందులో 175 ఎకరాల పక్కా డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయి. దీనికితోడు కొండారెడ్డిపల్లిలో 79 ఎకరాలు, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మరో 54 ఎకరాలు కలిపి మొత్తం 308 ఎకరాలు రేవంత్ కుటుంబం పేరిట ఉన్న మాట వాస్తవం కాదా?" అని సీఎంను సూటిగా ప్రశ్నించారు.
మావి వైట్ మనీ ఆస్తులు..
ఎన్నికల అఫిడవిట్, ఐటీ రిటర్న్స్‌లో చూపించిన తన వ్యవసాయ భూమిపై సీఎం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అధికారుల సర్వేలోనే తన భూమి రెండు గుంటలు తక్కువగా తేలిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అమెరికాలో 30 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్, పౌల్ట్రీ రంగంలో ఉన్న తన బంధువులు 2019లో చట్టబద్ధంగా బ్యాంక్ చెక్కుల ద్వారా వైట్ మనీతో 'రాజ్ బ్రీడర్స్' షేర్లను కొనుగోలు చేశారని వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న భారీ భూదందాలను ఆయన ఎండగట్టారు.
జనగామలో జరిగిన ఛాలెంజ్ క్యాంప్ స్కామ్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, భూభారతి ద్వారా యజమానులకే తెలియకుండా 9,200కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని ఆరోపించారు. గజ్వేల్‌లో క్యాన్సర్ పేషెంట్ భూమి సైతం అక్రమంగా బదిలీ అయిందన్నారు. హెచ్‌సీయూ, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములను ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కుదవపెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చిన ఘనత ఈ సర్కార్‌దేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 11.19 లక్షల మందికి సాదా బైనామాల ద్వారా, జీవో 58, 59లతో ఉచిత పట్టాలు ఇస్తే.. కాంగ్రెస్ వచ్చాక జీవో 76 (సింగరేణి), జీవో 118 (ఎల్బీనగర్) రిజిస్ట్రేషన్లను పూర్తిగా ఆపేశారని మండిపడ్డారు.
నాదర్‌గుల్‌లో రూ.10 వేల కోట్ల భూకుంభకోణం, సీఎం సోదరుడికి సంబంధించిన టెస్క్ కంపెనీకి భూ కేటాయింపు, పసుమాములలో మరో సోదరుడి భూమి నాలా కన్వర్షన్ వివాదాలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారని, దమ్ముంటే సీఎం తనతో కలిసి క్షేత్రస్థాయిలోకి రావాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ధరణి, భూభారతిలతో పాటు 22A నిషేధిత భూముల వ్యవహారం, రేవంత్ రెడ్డి గడచిన పదేళ్లలో, ప్రస్తుతం సంపాదించిన ఆస్తులన్నింటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












