KTR : తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై జోరుగా సాగుతున్న ప్రచారాలకు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో తెరదించారు. రాబోయే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’’ సదస్సులో పాల్గొన్న ఆయన, విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
విద్యార్థి సూటి ప్రశ్న.. కేటీఆర్ తేల్చిచెప్పిన సమాధానం
2028 ఎన్నికల్లో బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ చేతులు కలపబోతోందా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఏమాత్రం తడబడకుండా స్పందించారు. "బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు" అని ఒక్క మాటలో స్పష్టం చేస్తూ ఊహాగానాలకు బ్రేక్ వేశారు. సొంత బలంతోనే ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరతామనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై కీలక షరతు
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై జరుగుతున్న చర్చపై కేటీఆర్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు దాదాపు 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా దామాషా పద్ధతిలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా స్థానాల సంఖ్యను పెంచితేనే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ భారత ప్రాతినిధ్యానికి గండిపడనంత వరకు దీనికి మద్దతివ్వడానికి తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు.
ఏఐ విప్లవం.. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం
కృత్రిమ మేధ (AI) విస్తృతిపై స్పందిస్తూ, చరిత్రలో ఏ కొత్త సాంకేతికత వచ్చినా తొలుత ఆందోళనలు సహజమేనని, ప్రస్తుతం ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని అన్నారు. భయపడకుండా దాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేటీఆర్ ఈ సందర్భంగా గణాంకాలతో వివరించారు. తీవ్ర కరవు ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించేందుకు రూపొందించిన అద్భుతమైన ఇంజినీరింగ్ పరిష్కారమే కాళేశ్వరం ప్రాజెక్టు అని కొనియాడారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. 2014-15లో రాష్ట్రంలో వరి దిగుబడి కేవలం 44.4 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా 2023-24 నాటికి అది రికార్డు స్థాయిలో 168.8 లక్షల టన్నులకు ఎగబాకిందని వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో బీఆర్ఎస్ తెరవెనుక మైత్రి నెరుపుతోందంటూ జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు కేటీఆర్ నేరుగా యూనివర్సిటీ వేదిక నుంచే ఫుల్‌స్టాప్ పెట్టడం గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.










