Sangareddy Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో వినాయక నిమజ్జనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఉన్న శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం ఆశ్రమానికి చెందిన విద్యార్థులు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేసే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి జారిపడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ఆరుగురు చిన్నారులు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కుంటలో నుంచి విద్యార్థుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు ఉత్సాహంగా సాగిన వేడుకల్లో ఈ ఘటన పెను విషాదం నింపింది. విద్యార్థుల మృతితో ఆశ్రమంలో విషాదం అలుముకుంది.








