22A Lands: 22ఏ భూములు.. 12 రకాల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం.. పరిష్కార మార్గాలు ఇవే
22ఏ నిషేధిత భూముల అంశానికి సంబంధించి ప్రధానంగా 12 రకాల సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. వాటి పరిష్కారానికి అనుసరించబోయే మార్గాల వివరాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
1) ULC భూములు పాక్షికంగా క్రమబద్ధీకరించబడిన, క్రమబద్ధీకరించని కాలనీలు..
పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (ULC) మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం నూతన విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ పథకం పెండింగ్ లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో.
2) అధీకృత లేఔట్లలోని ప్రభుత్వ భూములు (HMDA / GHMC / DTCP)
కాంపిటెంట్ అథారిటీ ద్వారా ఆమోదించబడిన లేఔట్లలో పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ ప్రకటన. ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు నూతన పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.
3) సింగరేణి బొగ్గు గని ప్రాంతాల (కోల్ బెల్ట్) సమస్య
జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు. ఈ కమిటీ పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత అర్హతా ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది.
4) జీవో నెం 59 సమస్య
కన్వేయెన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి క్లియర్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు. మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రమబద్ధీకరణ విధానం కింద పరిష్కారం.
5) జీవో నెం. 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం)
పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కారం. పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22-A నిషేధిత జాబితా నుండి తొలగింపు.
6) అసైన్డ్ భూముల్లో నిర్మించిన గృహాలు
అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష , విస్తృత స్థాయి సంప్రదింపులు జరుపుతామని సీఎం రేవంత్ ప్రకటన
7) ఇందిరమ్మ పథకం.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన ఇళ్లు
ఈ అంశం అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది కావడంతో దీనిపై విస్తృత స్థాయి సంప్రదింపులు జరపాల్సి ఉంది.
8) ఇందిరమ్మ పథకం-లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన ఇళ్లు
5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన అనంతరం క్రయ విక్రయాలకు అనుమతి.
9) ప్రైవేట్ పట్టా భూములు నాలా (NALA) రుసుము చెల్లించని కేసులు
నాలా ఛార్జీలను స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయ విక్రయాలకు అనుమతి.
10) ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఔట్లు / కాలనీలు
ఈ తరహా అనధికారిక లేఔట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి.
11) సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్ధీకరణ
ఈ కేసులను పరిష్కరించేందుకు 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలోగా అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు.
12) స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్ మెంట్ భూములు, భూదాన్ భూములు
పేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటన. ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుపేద లబ్దిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగం.
దీంతో పాటు ఈ 12 అంశాలకు సంబంధించి పరిష్కారం కోసం ప్రత్యేకంగా హైపవర్ ఆఫీసర్ కమిటీ వేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ప్రకటించారు.







