TG Politics: శాసనసభ వేదికగా 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసిన ఆమె, 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నేరుగా ప్రభుత్వానికే సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికంటే ఒక్క గజం భూమి తనకు అదనంగా ఉన్నట్లు తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రుజువైనా ఆ భూమిని తక్షణమే సర్కార్‌కే సరెండర్ చేయడానికి సిద్ధమని తెగేసి చెప్పారు.
సిద్దిపేట భూములపై అసెంబ్లీలో రేవంత్ ఆరోపణలు..
సభలో 22A భూములపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా పరిధిలో కవిత, ఆమె భర్త పేరిట ఏకంగా 37.26 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కవిత సోషల్ మీడియాలో స్పందించారు. తన కుటుంబానికి ఎక్కడెక్కడో భూములు ఉన్నట్లు సీఎం రేవంత్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారమే తమ ఆస్తులు ఉన్నాయని, చట్టానికి మించి ఒక్క అంగుళం భూమి కూడా తమ వద్ద లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అఫిడవిట్‌కు మించి ఒక్క గజం ఎక్కువ ఉన్నట్లు చూపించినా ప్రభుత్వానికే రాసిస్తానని ఛాలెంజ్ చేశారు.
అందరి భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా?
కేవలం తనపైనే కాకుండా అసెంబ్లీలో సీఎం ప్రస్తావించిన నేతలందరి భూములపై సమగ్ర విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు. నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా సభలో పేర్లు ప్రస్తావించిన అందరి భూ కేటాయింపులు, లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన 37 ఎకరాల ఆరోపణకు కవిత నేరుగా ‘సీబీఐ విచారణ’ అస్త్రంతో కౌంటర్ ఇవ్వడంతో పాటు ‘భూములు సరెండర్’ సవాల్ విసరడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.











