My Home Group: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి ముసుగులో సాగిన అక్రమ భూ బాగోతాలను సర్వే నంబర్లతో సహా బట్టబయలు చేస్తూ అసెంబ్లీని నివ్వెరపరిచారు. "కేసీఆర్ హోమే మైహోం.. ఆ సంస్థ ఎవరి బినామీనో ఈ రాష్ట్రంలో తెలియనివారు ఎవరైనా ఉన్నారా?" అంటూ నేరుగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఒకే సంస్థ చేతుల్లోకి ఏకంగా వేల ఎకరాలు ఎలా వెళ్లాయో వివరిస్తూ, ఇది సుమారు లక్ష కోట్ల భారీ భూ కుంభకోణమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే ప్రత్యేక సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఎయిర్‌పోర్ట్ పక్కనే 2,463 ఎకరాలా?
శంషాబాద్ ప్రాంతంలో సాగిన భూ ఆక్రమణల లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ పరిధిలోని 5 ప్రధాన గ్రామాల్లో పేదలు, అసైన్డ్ రైతుల భూములను మైహోం సంస్థ బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. ఎయిర్‌పోర్టుకు ఆనుకుని ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 2,463 ఎకరాల భూమిని ఒక్క సంస్థకే ఎలా కట్టబెడతారని విమర్శించారు. చట్టాల కళ్లుగప్పి, సీలింగ్ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి ఈ మొత్తం భూములను 28 డొల్ల కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని ఆధారాలతో సహా సీఎం వివరించారు.
కాప్రా నుంచి మేళ్లచెర్వు దాకా లూటీ..
కేవలం శంషాబాద్‌కే పరిమితం కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ భూ కేటాయింపుల్లో నిబంధనలు తుంగలో తొక్కారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాప్రా పరిధిలోని ఎవాక్యూ భూములను, మేళ్లచెర్వులోని భూదాన్ భూములను మైహోం సంస్థకే దారాదత్తం చేశారని మండిపడ్డారు. కేవలం ఈ సంస్థకు అనుకూలంగా మార్చేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి, మేళ్లచెర్వు భూములను నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేయించారని సీఎం వెల్లడించారు. ఈ అక్రమాల విలువ బహిరంగ మార్కెట్లో లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యమకారుడు వేల కోట్లు సంపాదిస్తాడా?
చరిత్రలో జరిగిన ప్రజా ఉద్యమాలను ఉటంకిస్తూ కేసీఆర్ తీరుపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చరిత్రను తిరగేస్తే ప్రజల కోసం, హక్కుల కోసం ఉద్యమాలు చేసిన యోధులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారే తప్ప ఆస్తులు కూడబెట్టలేదు. కానీ తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ మాత్రం వేల కోట్లు, వందల ఎకరాలు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలి" అని నిలదీశారు.
శాసనసభ వేదికగా సర్వే నంబర్లు, గ్రామాలు, కంపెనీల వివరాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా డేటా బయటపెట్టడంతో గులాబీ శిబిరంలో కలవరం మొదలైంది. లక్ష కోట్ల విలువైన ఈ భూ బాగోతంపై ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించడంతో, రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని కీలక మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది.









