తెలంగాణ

CM Revanth Reddy: సీజ్‌ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్‌ భార్య పేరు మీదకు మార్చారు : సీఎం రేవంత్

రచన: Mahesh4 నిమిషాల పఠనం

CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. నిషేధిత 22A భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా, మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంపై సీఎం చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. నిషేధిత 22A భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా, మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంపై సీఎం చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం స్కాంలో ప్రభుత్వం సీజ్ చేసిన విలువైన భూములను సైతం అధికార బలంతో కేటీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకున్నారని సభాముఖంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.

శతభిష కంపెనీ భూములు కేటీఆర్ కుటుంబం చేతుల్లోకి ఎలా వెళ్లాయి?

ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా భూ దోపిడీకి పాల్పడిందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే సత్యం రామలింగరాజు కుటుంబానికి చెందిన సంస్థల భూములను తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. సత్యం కంపెనీ వ్యవహారంలో గతంలో ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ బదిలీ చేసుకున్నారని అన్నారు. రామలింగరాజు కుటుంబానికి చెందిన ‘శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ భూములను ఆయన తన భార్య, అత్తమామల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. "ప్రభుత్వం స్వయంగా సీజ్ చేసిన నిషేధిత భూములు ప్రైవేట్ వ్యక్తులకు, అందునా అప్పట్లో అధికారంలో ఉన్న మంత్రి కుటుంబానికి ఎలా బదిలీ అవుతాయి?" అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిలదీశారు.

ఎర్రవల్లి ఫాంహౌస్ లెక్కలు తేలాల్సిందే..

కేవలం ఈ బదిలీలకే పరిమితం కాకుండా, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ ఉన్న వందలాది ఎకరాల భూములపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఫాంహౌస్ పరిధిలో అక్రమంగా భారీ విస్తీర్ణంలో భూములు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ భూముల వాస్తవాలు, రికార్డులను నిగ్గుతేల్చే ప్రక్రియను కేవలం 30 రోజుల్లోగా పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

ధరణి ముసుగులో నిషేధిత జాబితాలోని భూములను చెరబట్టిన తీరుపై ఇప్పటికే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను కుటుంబ ఆస్తులుగా మార్చుకున్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

#CM Revanth Reddy#Revanth Reddy#KTR#K T Rama Rao#Telangana Assembly#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి