తెలంగాణ

22A Lands: ఆ భూములను 22ఏ నుంచి తొలగిస్తాం- సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

రచన: NK9 నిమిషాల పఠనం

22A Lands: తెలంగాణలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైపవర్‌ ఆఫీసర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్‌ తీసుకొస్తామన్నారు.

22A Lands: తెలంగాణలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైపవర్‌ ఆఫీసర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్‌ తీసుకొస్తామన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఔట్ల దరఖాస్తులు పరిశీలిస్తామని తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న, కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కరిస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు వ్యవస్థ తీసుకొస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు.

''22ఏ సమస్యల్లో 12 రకాల అంశాలను గుర్తించాం. యూఎల్‌సీ భూముల విషయంలో త్వరలో కొత్త విధానం తెస్తాం. అధీకృత లేఔట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను వారంలో పరిష్కరిస్తాం. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న లేఔట్ల రిజిస్ట్రేషన్లు కూడా చేస్తాం. ఇకపై 22ఏ జాబితాలో భూమిని చేర్చడం, తొలగించడం కోసం స్పష్టమైన నిబంధనలు తెస్తాం. రిజిస్ట్రేషన్/పట్టా భూములన నిషేధిత జాబితాలో పెట్టం. ఎక్కడైనా పొరపాటున వ్యక్తిగత (రిజిస్ట్రేషన్/పట్టా) భూములు 22ఏ జాబితాలో చేరిస్తే.. సబ్ కలెక్టర్లు/ఆర్డీవోలు వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటారు'' అని సీఎం రేవంత్ ప్రకటించారు.

ప్రభుత్వం క్రమబద్ధీకరించిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. జీవో 166, జీవో 59, జీవో 58, జీవో 165 కింద క్రమబద్ధీకరించిన భూములకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. వేలంలో కొనుగోలు చేసిన భూములు, బ్యాంకుల్లో తనఖా పెట్టి వేలం వేసిన భూములను కూడా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు. వ్యక్తులు లేదా సంస్థలు మార్కెట్ విలువ చెల్లించి అసైన్డ్ భూములు పొందితే అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉత్తర్వులు ఇస్తుంది, అప్పుడు వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ చెప్పారు.

ప్రభుత్వం అనుమతులు తీసుకున్న లేఔట్లలో పూర్వం రిజిస్ట్రర్ అయిన డాక్యుమెంట్ ఉండి లేఔట్ అనుమతి ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని, ఎటువంటి సమస్య లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుందన్నారు. ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు ఎండోమెంట్, వక్ఫ్ భూములను చట్ట ప్రకారం వేలంలో కొనుగోలు చేస్తే ఆ భూములనూ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు.

ఇనాం, ఇతర షరతులతో ఇచ్చిన పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగింపు విషయంలో ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులపై ఏమైనా అసంతృప్తి ఉంటే 60 రోజుల్లోగా జాయింట్ కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈ ఉత్తర్వులపై అసంతృప్తి ఉంటే 90 రోజుల్లో ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ కూడా పెట్టుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రకంగా ఒక సిస్టమ్ ను అడాప్ట్ చేసుకుని స్పష్టంగా ముందుకెళ్లాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిందన్న ఆరోపణలను సీఎం రేవంత్ ఖండించారు. అసలు వివాదం 3.73 లక్షల ఎకరాల ప్రైవేట్‌ పట్టా భూముల గురించేనన్నారు. వాటిని చూపించి కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

మరోవైపు ఎల్బీనగర్‌లో జీవో 118 పరిధిలో ఉన్న వారందరికీ త్వరలో శుభవార్త చెబుతామన్నారు సీఎం రేవంత్. ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. జీవో 118 కింద పెండింగ్‌ దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరిస్తామని చెప్పారు.

''22ఏ నిషేధిత జాబితాలో భూములు పెట్టడానికి, తొలగించడానికి నిబంధనలు ఏంటో చెబుతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే 22ఏ భూముల జాబితా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనూ ఆ జాబితా కొనసాగింది. 22ఏ జాబితా అప్ డేట్ చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో కలెక్టర్లు పాత జాబితాలోనే అప్ డేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ భూమిని 22ఏ జాబితాలో చేర్చలేదు. ప్రతిపక్షాలు ప్రజలకు కలిగించిన అపోహలను నివృత్తి చేస్తాం. ఈ క్రమంలో ఇక ముందు 22ఏ జాబితాలో ఏ భూమి చేర్చాలన్నా నిర్ధిష్ట విధానాలతో ముందుకెళ్తాము.

ఇక ముందు ఏయే భూములను 22ఏ జాబితాలో చేర్చే ప్రక్రియను సంబంధిత ఆర్డీవో, కలెక్టర్ మాత్రమే చూస్తాను. భూ సర్వే నెంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం, పట్టాదారు, యజమాని వివరాలను స్పష్టంగా గుర్తిస్తారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు, ప్లాట్, డోర్ నెంబర్ తదితర వివరాలు నమోదు చేస్తారు. రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్ తదితర సంబంధిత రికార్డులు పరిశీలించి భూమి స్థితిని నిర్ధారిస్తారు. మొత్తం సర్వే నెంబర్ లోని కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయితే ఆ భాగాన్ని ప్రత్యేకించి సబ్ డివిజన్ చేస్తారు. ఆ భూమిని మాత్రమే 22ఏ జాబితాలో చేరుస్తారు. మిగిలిన భూమిని నిషేధిత జాబితాలో చేర్చరు.

సదరు భూ యజమాని ఆక్యుపెంట్ గా ముందుగా ఈ కేవైసీ ద్వారా నోటీసు జారీ చేస్తారు. అది సాధ్యం కాకపోతే ఈమెయిల్, ఆధార్ కార్డుకు అనుసంధానమైన అడ్రస్ కు రిజిస్ట్రర్ పోస్టు పంపుతారు. అవసరమైతే స్థానిక పత్రికల్లో ప్రకటన ఇస్తారు. ఆ నోటీసు లేదా ప్రకటనకు సమాధానం ఇచ్చేందుకు సదరు యజమానికి 15 రోజుల అవకాశం ఇస్తాం. వాళ్ల దగ్గర ఏమనా రికార్డులు ఉంటే తీసుకొచ్చి వెరిఫై చేయించుకుంటే వాళ్ల భూములు నిషేధిత జాబితాలో పెట్టకుండా కాపాడుకోవచ్చు.

సంబంధిత వ్యక్తి తెలిపిన అభ్యంతరాలు, సమర్పించిన పత్రాలను పరిశీలించి అవసరమైన రికార్డులను ధృవీకరించి అధికారులు విచారణ చేపడతారు. విచారణ తర్వాత భూమిని 22ఏ జాబితాలో చేర్చడానికి లేదా చేర్చకపోవడానికి కారణాలను స్పష్టంగా పేర్కొంటూ అధికారులు స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తారు. అంటే, ఈ మొత్తం ప్రాసెస్ ను రికార్డ్ చేసి బాధితుడికి ఒక ఆడియో కాపీ చేతిలో పెడతాం'' అని సీఎం రేవంత్ తెలిపారు.

#22A Lands#Cm Revanth Reddy#Telangana#Assembly#22A Prohibited Lands#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి