22A Lands : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న 22A నిషేధిత భూముల వ్యవహారంపై శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గత బీఆర్‌ఎస్ పాలనలో తెరవెనుక సాగిన భారీ భూ దందాలను, ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను ఎండగడుతూ అధికార పక్షం తరఫున గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా భూములు 22A (నిషేధిత జాబితా)లో ఉండటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. అసలు ఆ కోటి ఎకరాల లెక్క ఏంటో అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశారు. "ఆ కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే ఉండాలి.. అందులోంచి ఒక్క ఇంచు భూమిని కూడా తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు" అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
కోటి ఎకరాల భూమి ఎవరిది?
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కోటి 2 లక్షల ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ కోటి ఎకరాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ భూములన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఆ జాబితాలోకి వెళ్లాయని సీఎం సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భూములకు సంబంధించిన అధికారిక లెక్కలను వెల్లడించారు. అటవీ భూములు దాదాపు 42 లక్షల 500 ఎకరాలు (ఇవి పక్కా ప్రభుత్వ ఆస్తులు) ఉన్నాయి. అలాగే చెరువులు, శిఖం భూములు 29 లక్షల 35 వేల ఎకరాలు, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములు దాదాపు 93 లక్షల 31 వేల ఎకరాలు ఉన్నట్లు స్పష్టం చేశారు.
"ప్రజా సంపద అయిన అటవీ భూములు, పేదలకిచ్చిన అసైన్డ్ భూములు, ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న శిఖం భూములను 22Aలో పెట్టకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా? వాటిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తే పేదలకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టే, ఆ కోటి ఎకరాలు నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అసలు వివాదం 3.73 లక్షల ఎకరాలదే
కోటి ఎకరాల అంశాన్ని చూపిస్తూ మొత్తం వ్యవహారాన్ని బీఆర్‌ఎస్ పక్కదారి పట్టిస్తోందని సీఎం మండిపడ్డారు. అసలు సమస్య అంతా 3 లక్షల 73 వేల 903 ఎకరాల ప్రైవేట్ పట్టా భూముల విషయంలోనే ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని, దళారులు, గులాబీ నేతలు కుమ్మక్కై అమాయక రైతుల పట్టా భూములను అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. "3.73 లక్షల ఎకరాల ప్రైవేట్ భూముల సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. కోటి ఎకరాల కబ్జా అంటూ మా ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తున్నారు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో దళారులు, కొందరు నేతలు కలిసి రైతుల భూములను చెరబట్టారని, ధరణి ద్వారా సాగిన ఈ భూదోపిడీని తమ ప్రభుత్వం నిగ్గుతేల్చుతుందని సీఎం హెచ్చరించారు. సామాన్య ప్రజలు, రైతుల హక్కులకు భంగం కలగకుండా నిజమైన పట్టాదారులకు న్యాయం చేస్తామని, ప్రభుత్వ, అటవీ భూములను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.








