దునియా

UPI Charges : యూపీఐ ఛార్జీలు.. సామాన్యుడిపై ధరల మోత తప్పదా..?

రచన: Mahesh5 నిమిషాల పఠనం

UPI Charges: ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ మేఘాలు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమనడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి.

UPI Charges: ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ మేఘాలు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమనడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఆ భారాన్ని వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు తమ సరుకులపై పెంచి చేతులు దులుపుకోగా.. చివరకు నిత్యావసరాలు కొనలేక అల్లాడిపోయింది మాత్రం సగటు సామాన్యుడే.

సరిగ్గా ఇలాంటి సంక్షోభ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు తీసుకువస్తున్న ‘యూపీఐ ఛార్జీల’ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల నెత్తిన పిడుగులా పడబోతోందనే కామెంట్స్ సామాన్యుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పైకి ఇది వ్యాపారులకే పరిమితమని చెబుతున్నా.. అంతిమంగా ప్రజల జేబులను గుల్ల చేసే మరో పరోక్ష బాదుడేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.2 వేలు దాటితే ఛార్జీల బాదుడే..

నోట్ల రద్దు తర్వాత టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు దేశంలో రూపాయి కూడా క్యాష్ లేకుండా గడిచిపోయేలా యూపీఐ వ్యవస్థ ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. రోజుకు దాదాపు 80 కోట్ల లావాదేవీలతో లక్ష కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్న ఈ వ్యవస్థలో అక్టోబర్ 15 నుంచి కీలక మార్పులు రాబోతున్నాయి.

ఇకపై పెద్ద వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్ పోర్టల్స్‌లో రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం మేర ఛార్జీలు వర్తించనున్నాయి. అలాగే లావాదేవీ ఎంత పెద్దదైనా గరిష్టంగా రూ.300 వరకు ఛార్జీ పరిమితి విధించనున్నారు. విద్యుత్, వాటర్, పైపుడ్ గ్యాస్ బిల్లులు, ఇన్సూరెన్స్, పెట్రోల్, స్కూల్ ఫీజులు వంటి కీలక చెల్లింపులు పరిమితి దాటితే ఈ ఛార్జీల పరిధిలోకి వచ్చే అవకాశముంది.

అయితే వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ (P2P) బదిలీలకు, నెలకు లక్ష రూపాయల లోపు టర్నోవర్ ఉండే చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీల నుంచి ఊరట కల్పించారు.

మర్చెంట్లు భరిస్తారా? సామాన్యుడిపై తోసేస్తారా?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఛార్జీలను వినియోగదారులు కాకుండా వ్యాపారులే (మర్చెంట్స్) భరించాలి. కానీ మార్కెట్ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులపై 2 శాతం ఛార్జీలను వ్యాపారులే కట్టాలని ఆర్బీఐ నిబంధనలు ఉన్నప్పటికీ.. మార్కెట్లో ఏ షాపుకు వెళ్లినా ఆ 2 శాతాన్ని కస్టమర్ల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్న చేదు అనుభవం అందరికీ తెలిసిందే. లాభాపేక్షతో వ్యాపారం చేసే ఏ వ్యాపారవేత్త కూడా తన జేబులోంచి పైసా తీసి బ్యాంకులకు కట్టడన్నది జగమేరిగిన సత్యం.

ఇరాన్ - అమెరికా యుద్ధ పరిణామాలతో పెరిగిన రవాణా ఖర్చులను సరుకుల ధరల్లో కలిపేసినట్లే.. రేపు యూపీఐపై పడే 0.4 శాతం ఛార్జీని కూడా వ్యాపారులు వస్తువుల ఎంఆర్‌పీ (MRP) ధరలను పెంచో లేదా బిల్లుపై అదనంగా ఛార్జ్ చేసో రికవర్ చేసుకోవడం ఖాయం. అటు పెట్రో బాదుడు.. ఇటు నిత్యావసరాల ధరల మంట.. వీటికితోడు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్‌పై పరోక్ష ఛార్జీలు తోడైతే సగటు జీవి బతుకు మరింత భారంగా మారక తప్పదు.

విదేశీ పేమెంట్ గేట్‌వేల ఒత్తిళ్లు, సర్వర్ నిర్వహణ వ్యయాల వల్ల ప్రభుత్వం ఇకపై ఉచిత సబ్సిడీలను కొనసాగించలేమనే ధోరణిలో ఉంది. 96 శాతం లావాదేవీలకు ఛార్జీలు ఉండవని పాలకులు సమర్థించుకుంటున్నా.. మార్కెట్ మాయాజాలంలో చివరకు నలిగిపోయేది మాత్రం ఏమీ మాట్లాడలేని సగటు పేదవాడే.

#UPI Charges#UPI Transaction Charges#UPI Payment#UPI Fees#UPI Rules#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి