Cm Revanth: 22ఏ నిషేధిత భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో ధరణితో భూదందాకు తెరలేపారని సీఎం రేవంత్ ఆరోపించారు. 2.50 కోట్ల ఎకరాల భూముల డేటా విదేశీ మాఫియా (కేమెన్ ఐల్యాండ్స్) చేతిలోకి వెళ్లిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు.
పేదల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు సీఎం రేవంత్. సభలో కేసీఆర్ కూర్చుంటే ఆయన ముందే అన్ని ఆధారాలు బయట పెడతామని చెప్పారు. వారు చేసిన అక్రమాలను బయటపెడతామనే బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించి సభ నుంచి పారిపోయారని సీఎం రేవంత్ విమర్శించారు. కేసీఆర్ సభకు వస్తారని అనుకోవడం లేదన్నారు.
భూమి కబ్జాకు గురైతే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద కేసు పెట్టొచ్చు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 2016లో ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేశారు.. ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారు? అని బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ ప్రశ్నించారు. ధరణి తీసుకొచ్చి తెలంగాణను నాశనం చేశారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్. వారికి కావాల్సిన వారి కోసం నిబంధనలను మార్చారని ఆరోపించారు.
కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టామంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ మండిపడ్డారు. అసైన్డ్, ఫారెస్ట్, దేవాదాయ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి కేసీఆర్ తో లేఖ రాయించాలన్నారు. ఫారెస్ట్, ఎండోమెంట్ భూములను నిషేధిత జాబితాలో పెట్టి కాపాడుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. భూములను కొల్లగొట్టేందుకే నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారుని ఎదురుదాడికి దిగారు సీఎం రేవంత్. అసైన్డ్, ఫారెస్ట్, దేవాదాయ భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. 3,73,931 ఎకరాల ప్రైవేట్ భూమి విషయంలోనే ఇప్పుడు పంచాయితీ నెలకొందని అసెంబ్లీలో సీఎం రేవంత్ అన్నారు.










