తెలంగాణ

Telugu States DebtCrisis: అప్పుల సునామీలో తెలుగు రాష్ట్రాలు.. భవిష్యత్తు దివాలా దిశగానేనా?

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Telugu States DebtCrisis: ప్రజా సంక్షేమం ముసుగులో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ప్రమాదకరమైన అంచుకు చేరుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న ఉచిత హామీలు, పథకాల అమలు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలను కొల్లగొడుతున్నాయి.

Telugu States DebtCrisis: ప్రజా సంక్షేమం ముసుగులో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ప్రమాదకరమైన అంచుకు చేరుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న ఉచిత హామీలు, పథకాల అమలు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలను కొల్లగొడుతున్నాయి. రాష్ట్రాల మొత్తం ఆదాయంలో ఏకంగా 62 శాతం కేవలం జీతాలు, పింఛన్లు, వడ్డీలు, ఉచిత పథకాలకే సరిపోతుండటం ఆర్థిక నిపుణులను నివ్వెరపరుస్తోంది. అప్పు తెచ్చి మరీ సంక్షేమం పంచడం అనే ప్రమాదకర విధానం ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో పాలన సాగించడం కూడా అసాధ్యంగా మారి రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితులు తప్పవన్న తీవ్ర హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.

కొండలా పేరుకుపోతున్న అప్పులభారం

రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా అప్పుల వేగం మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మినహా, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించే దీర్ఘకాలిక ప్రణాళికలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇదే:

2014లో రూ.72 వేల కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ ప్రయాణం.. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి భారీ ప్రాజెక్టులు, కార్పొరేషన్ రుణాలతో ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది. ప్రస్తుతం ఏడాదికి కేవలం పాత అప్పుల వడ్డీలు, అసలు కట్టడానికే దాదాపు రూ.90 వేల కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. జీఎస్టీపీలో అప్పుల శాతం ఏకంగా 29 శాతానికి చేరువవుతుండటం గమనార్హం.

సంక్షోభం అంచున ఆంధ్రప్రదేశ్:

విభజన నాటికే లోటు బడ్జెట్‌తో నడిచిన ఏపీ అప్పుల భారం ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్లకు చేరింది. ప్రతి నెలా సగటున రూ.15 వేల కోట్లకు పైగా రుణాలు సేకరిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్ర సొంత పన్ను రాబడి కంటే చేస్తున్న అప్పులే అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆస్తుల కూడబెట్టేది లేదు.. మిగులుతున్నది వడ్డీలే

సాధారణంగా అభివృద్ధి పేరుతో తీసుకునే అప్పులతో సంపద సృష్టి జరిగి తిరిగి ఆదాయం రావాలి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. వస్తున్న ఆదాయంలో 15 నుంచి 22 శాతం కేవలం గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా బడ్జెట్ బయట తెస్తున్న 'ఆఫ్ బడ్జెట్' రుణాలు లెక్కల్లోకి రాని పెనుభారంగా మారాయి.

ద్రవ్యోల్బణ నియంత్రణ, జీఎస్టీపీ వృద్ధి వంటి అంశాల్లో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు మెరుగైన స్థానాల్లో ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రుణ భారం ఈ సానుకూలతలను మింగేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లుగా లోటును భర్తీ చేసేందుకు కరెన్సీ ముద్రించే అధికారం రాష్ట్రాలకు లేదు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం గల్లాపెట్టె ఖాళీ చేసి భవిష్యత్ తరాల నెత్తిన లక్షల కోట్ల భారాన్ని మోపడం భావి తరాలకు శాపంగా మారక తప్పదు. ఇకనైనా ఉచితాల జోరు తగ్గించి, మూలధన పెట్టుబడులపై దృష్టి సారించకపోతే సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.

#Telugu States Debt Crisis#Telangana Debt#Andhra Pradesh Debt#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి