అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ సభ్యులపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. సభను తప్పుదోవ పట్టించాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికే సెషన్స్ ప్రారంభం రోజున బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలోని తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని వారికి ముందే తెలుసునని, దీనికి తోడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్రపూజలు చేసిన అంశంపైనా చర్చకు పట్టుబడతామని తెలిసే వికృత చేష్టలు చేశారని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వ తప్పిదాలపై చర్చ జరగకూడదు అనేదే బీఆర్ఎస్ పార్టీ విధానమని, అసెంబ్లీ నిర్వహణపై గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిబంధనలనే తమ ప్రభుత్వం పాటించిందని స్పష్టం చేశారు. స్లోగన్స్‌తో కూడిన డ్రెస్సులు ధరించడం, ప్లకార్డులతో అసెంబ్లీకి రావొద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిబంధనలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకే అసెంబ్లీ గేట్ నెంబర్-3 వద్ద పోలీసులు, అధికారులు ప్రతిపక్ష సభ్యులను అడ్డుకున్నారన్నారు. పార్లమెంట్‌లో ఇలాంటి నిబంధన ఉన్నా అక్కడ రాహుల్ గాంధీని అడ్డుకునే వారని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన అసెంబ్లీ రూల్స్‌ను బీఆర్ఎస్ బ్రేక్ చేసిందని, సభ బయట పోలీసులపై దాడి చేయడంతో పాటు సభాధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు విచక్షణ కోల్పోయి అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు.
ఇక 22ఏ అంశం మీద మాట్లాడిన సీఎం రేవంత్.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బాధ్యతను ఇంకెవరో గుర్తుచేయాల్సిన అవసరం లేదన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని అసెంబ్లీ కంటే ముందే 22ఏ సమస్యపై ఫోకస్ పెట్టామని వివరించారు. తమపై వచ్చిన ఆరోపణల వల్లే 22 ఏ అంశం మీద చర్చ పెట్టామని తెలిపారు. ప్రధాన సమస్యలపై చర్చ నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నించిందని సీఎం రేవంత్ ఆరోపించారు. రూల్స్ ని పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.










