పున్నామా నరకం నుంచి రక్షించేవాడిని కొడుకు అంటారని నానుడి ఉంది.కానీ, నేడు ఆ తనయులే తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతున్నారు. ఆస్తిపాస్తుల కోసం, భార్య చెప్పిందని, సంతానం కోసం పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు.వారిని పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.డబ్బులు ఇవ్వడం లేదని, ఆస్తి పేరిట రాయడం లేదని వారిని దూషించడం, దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. వారికి తిండి పెట్టకుండా నరకయాతనకు గురిచేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ప్రస్తుత రోజుల్లో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. కన్నకొడుకు ఇంటి నుండి గెంటివేశాడనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరి తనయుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన మియాపూర్‌లోని ఇంద్రారెడ్డి అల్విన్ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
కుమారుడు, కోడలు కలిసి తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే ఇల్లు అమ్మకానికి పెట్టారని చెప్పారు. కొడుకు, కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని వేడుకున్నారు.
https://x.com/QGroupMedia/status/2100124519679811830?s=20
తమకు న్యాయం జరగకపోతే చావు ఒక్కటే మార్గని కన్నీటి పర్యంతం అయ్యారు. చిన్నతనం నుంచి కొడుకును పెంచి పెద్దచేస్తే తమను పట్టించుకోకపోగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయారు.తన కొడుకు, కోడలు మీద చర్యలు తీసుకోవాలని, తమ ఇంటిని తమకు ఇప్పించాలని వేడుకున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ ఇంటిఎదుట ధర్నాకు దిగిన వృద్ధ దంపతులకు స్థానికులు మద్దతుగా నిలిచారు.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో చాలామంది తమ కుమారులు, కుమార్తెలు పట్టించుకోవడంలేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.కొందరు కూతుళ్లు, తనయులు తల్లిదండ్రులను రోడ్ల మీద విడిచి వెళ్లిపోయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.











