తెలంగాణ

KCR Farmhouse: కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం.. 30రోజుల డెడ్‌లైన్

రచన: NK5 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ జరిగింది.

KCR Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందిన ఎర్రవెల్లి ఫాంహౌస్ పై సమగ్ర విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ జరిగింది.

కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందో లేదో నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆ 700 ఎకరాల ఫామ్ హౌస్ లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న సీఎం రేవంత్.. ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. విచారణలో ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే దాన్ని పేద దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచి పెడతామని సీఎం రేవంత్ ప్రకటించారు.

''రెవెన్యూ శాఖకు, కలెక్టర్ కు ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వండి. ఆయన కొనుగోలు చేసింది ఎంత? అక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది? 30 రోజుల వ్యవధిలో ఇది తేల్చాలి? రెవెన్యూ శాఖ మంత్రికి, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా'' అని సీఎం రేవంత్ అన్నారు.

కేసీఆర్ 700 ఎకరాల ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ పై 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వకపోతే అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ హెచ్చరించారు. క్షమించే సమస్యే లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిని అని చెప్పుకునే కేసీఆర్ వేల కోట్లు రూపాయల విలువ చేసే వందల ఎకరాలు ఎలా సంపాదించారు అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మొత్తం 9 జిల్లాల్లో 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439.30 ఎకరాలు అంటే 440 ఎకరాల భూమి కేసీఆర్ కుటుంబసభ్యుల పేరు మీద ఉందన్నారు. కేసీఆర్ కి నోటీసులిచ్చి ఆ 388 ఎకరాల భూములను 800 దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచుతానని అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్.

''చరిత్రను పరిశీలిస్తే ప్రజల కోసం ఉద్యమాలు చేసిన ఏ ఒక్క ఉద్యమకారుడి దగ్గర ఇంచు భూమి కూడా లేదు. కొమురం భీముడు, చెగువేర, గద్దర్, అందెశ్రీ, రావి నారాయణ రెడ్డి, బద్దం నరసింహా రెడ్డి, కమలా దేవి, ధర్మ భిక్షం కావొచ్చు.. వీరిలో ఎవరి దగ్గర కూడా ఇంచు భూమి లేదు. చరిత్ర పరిశీలిస్తే ఏ ఉద్యమకారుడైనా సర్వం కోల్పోయారు. కానీ, కేసీఆర్ కుటుంబానికి హైదరాబాద్ చుట్టుపక్కల 440 ఎకరాల భూమి ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా కేసీఆర్ పేరు మీద ఇంత భూమి ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ ఏం వ్యాపారం చేశారు? ఎక్కడ నుంచి సంపాదించారు?

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల భూములను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఈరోజు మా మీదే ఆరోపణలు చేస్తోంది. నేను సవాల్ విసురుతున్నా. చేతనైతే కాగితాలు బయటపెట్టండి. కేసీఆర్ కుటుంబం పేరు మీదున్న 440 ఎకరాల భూముల వివరాలు బయటపెట్టాను. ఇంత కక్కుర్తా? ఇంత భూ దాహమా?'' అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.

#KCR Farmhouse#Enquiry#Cm Revanth Reddy#Telangana Assembly#Erravelli Farmhouse#Swechaa News#22A
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి