KCR Family Lands: 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్, ఆయన కుటుంబం భూ దోపిడీకి పాల్పడిందని.. కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల భూములు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు.. ఇలా ఒక్కొక్కరి పేరు చెబుతూ ఒక్కొక్కరు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నారో అసెంబ్లీ వేదికగా చిట్టా విప్పారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమం ముసుగులో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల విలువైన వందల ఎకరాలు వెనకేసుకుందని రేవంత్ ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం కుటుంబానికి గరిష్టంగా ఉండాల్సిన భూమి కంటే విపరీతంగా ఆస్తులు కూడబెట్టారని లెక్కలు బయటపెట్టారు. కేసీఆర్-శోభ దంపతులకు మార్కూక్ తదితర ప్రాంతాల్లో 67.5 ఎకరాల భూమి ఉందన్నారు (సీలింగ్ యాక్ట్ ప్రకారం గరిష్టంగా ఉండాల్సింది 27 ఎకరాలే). అలాగే కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన భూమి లెక్కలు చెబుతూ.. కేటీఆర్, శైలిమ, హిమాన్షు, అలేఖ్య పేర్ల మీద మొత్తంగా 123.19 ఎకరాలు ఉన్నాయాన్నారు. హరీష్ రావు దంపతులకు 30.5 ఎకరాలు, కవిత-అనిల్ కుమార్ దంపతులకు 37.26 ఎకరాలు, సంతోష్ రావు కుటుంబానికి 79.5 ఎకరాలు.. నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉన్నాయని సభలో సీఎం రేవంత్ వెల్లడించారు.
మొత్తంగా 9 జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి కేసీఆర్ కుటుంబం వద్ద 440 ఎకరాలకు పైగా భూమి ఉందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చరిత్రలో కొమురం భీమ్, చేగువేరా వంటి సాయుధ పోరాటయోధులు, ఉద్యమకారులు ఎవరూ కూడా ఆస్తులు కూడబెట్టలేదని, సర్వం త్యాగం చేశారని రేవంత్ గుర్తుచేశారు. ఉద్యమం పేరు చెప్పుకుని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కేసీఆర్ జాతకాన్ని బహిర్గతం చేశానని, దమ్ముంటే రికార్డులతో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
''కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్‌పై నేనెందుకు బాంబులు వేస్తా? ఆయన ఏమైనా బిన్‌లాడెనా. స్టీఫెన్‌సన్‌కు ఎన్నికల ముందు నజరానా ఇచ్చారు. రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్ చేశారు. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్‌రెడ్డి 650 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారు. జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చింది? పైలట్ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. ఒక కుటుంబానికి కుష్కి పొలం 54, తరి పొలమైతే 27 ఎకరాలుండాలి. కానీ, కేసీఆర్‌కు ఉన్నది మొత్తం తరి పొలమే’’ అని సీఎం రేవంత్ శాసనసభ వేదికగా వివరించారు.








