తెలంగాణ

CM Revanth Reddy : నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో పెట్టినవే : సీఎం రేవంత్

రచన: Mahesh7 నిమిషాల పఠనం

CM Revanth Reddy : తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ భూములపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన భూ బాగోతాన్ని బయటపెడుతూ అసెంబ్లీ సాక్షిగా బాంబు పేల్చారు

CM Revanth Reddy : తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ భూములపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన భూ బాగోతాన్ని బయటపెడుతూ అసెంబ్లీ సాక్షిగా బాంబు పేల్చారు. దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో ఏకంగా 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమి అక్రమంగా కలిసిపోయిందని ఆరోపించారు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని, 800 మంది దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచిపెడుతుందని సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో 700 ఎకరాల మతలబు ఇదే

కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ప్రాంతంలో జరిగిన భూ మార్పిడులపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1944 సర్వే ప్రకారం ఎర్రవల్లి, షేర్ వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లోని భూముల వివాదాలను అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రికార్డుల్లో కేసీఆర్ కుటుంబం పేరిట ఉన్నది 295 ఎకరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే అదే ప్రాంతంలోని సర్వే నెంబర్ 325 పరిధిలో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉందని ఆధారాలతో సహా సభ ముందుంచారు. 2017లో ధరణి ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన ముసుగులో భారీగా మార్పులు చేసి, రికార్డులు లేని ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 700 ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌కు నోటీసులు.. అధికారులకు 30 రోజుల డెడ్‌లైన్

ఈ అక్రమ భూ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణ కార్యాచరణ ప్రకటించారు. కేసీఆర్‌కు వెంటనే నోటీసులు జారీ చేసి, అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం భూమి ఎంత, అసలు కొనుగోలు చేసింది ఎంత, అందులోని 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరి అధీనంలో ఉందో లెక్క తేల్చాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ శాఖకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ.. "30 రోజుల్లో ఈ వ్యవహారం తేలాలి. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే మంత్రులు, అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటాం" అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఫాంహౌస్ గుట్టు తేల్చడానికి వెంటనే నిజనిర్ధారణ కమిటీ వెళ్లాలని ఆదేశించారు.

"పసుపు నీళ్లు చల్లిన చోటే.. 800 మంది దళితులకు పట్టాలు"

గతంలో ఫాంహౌస్ ముందు దళితులు నిరసనగా డప్పు కొట్టి, నడుచుకుంటూ వెళ్లిన కారణంగా పసుపు నీళ్లు చల్లి అవమానించారని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారికి గట్టి సమాధానం చెబుతామన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 800 మంది పేద దళిత కుటుంబాలకు పట్టాలుగా పంపిణీ చేసి వారిని భూ యజమానులను చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కేసీఆర్ కుటుంబం వద్ద 440 ఎకరాలు.. సీలింగ్ చట్టం వర్తించదా?

తెలంగాణ ఉద్యమం ముసుగులో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల విలువైన వందల ఎకరాలు వెనకేసుకుందని రేవంత్ ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం కుటుంబానికి గరిష్టంగా ఉండాల్సిన భూమి కంటే విపరీతంగా ఆస్తులు కూడబెట్టారని లెక్కలు బయటపెట్టారు. కేసీఆర్ - శోభలకు మార్కూక్ తదితర ప్రాంతాల్లో 67.5 ఎకరాలు ఉందన్నారు (సీలింగ్ ప్రకారం గరిష్టంగా ఉండాల్సింది 27 ఎకరాలే). అలాగే కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన లెక్కలు చెబుతూ.. కేటీఆర్, శైలిమ, హిమాన్షు, అలేఖ్య పేర్ల మీద మొత్తంగా 123.19 ఎకరాలు ఉన్నాయాన్నారు. హరీష్ రావు దంపతులకు 30.5 ఎకరాలు, కవిత - అనిల్ కుమార్ దంపతులకు 37.26 ఎకరాలు, సంతోష్ రావు కుటుంబానికి 79.5 ఎకరాలు..నవీన్ రావు, కొండల్ రావులకు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయని సభలో సీఎం వెల్లడించారు.

మొత్తంగా 9 జిల్లాల్లోని 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి కేసీఆర్ కుటుంబం వద్ద 440 ఎకరాలకు పైగా భూమి ఉందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చరిత్రలో కొమురం భీమ్, చే గువేరా, సాయుధ పోరాట యోధులు, ఉద్యమకారులు ఎవరూ కూడా ఆస్తులు కూడబెట్టలేదని, సర్వం త్యాగం చేశారని గుర్తుచేశారు. ఉద్యమం పేరు చెప్పుకుని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కేసీఆర్ జాతకాన్ని బహిర్గతం చేశానని, దమ్ముంటే రికార్డులతో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

#CM Revanth Reddy#Revanth Reddy#Telangana Politics#TG Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి