Jurala Water: ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి సాగునీటి కోసం రైతాంగం చేస్తున్న పోరాటం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అమరచింత మండల పరిధిలోని జూరాల ఎడమ కాలువ వద్దకు పోనివ్వకుండా రైతాంగాన్ని అడ్డుకునేందుకు అడుగడుగున భారీగా పోలీసులు మోహరించారు.
జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మద్య తోపులాట జరిగింది. మక్తల్ మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులపై లాఠీచార్జ్ జరపడం ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రాణాలకు తెగించి కాలువలోకి
సాగునీరు విడుదల చేయాలని నిరసిస్తూ రైతులు ఏకంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాంతర కాలువలోకి దిగి, జూరాల ఎడమ కాలువ రెగ్యులేటర్ వైపు నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలు జూరాల ప్రాజెక్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
రహదారుల దిగ్బంధం
రైతులు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకోకుండా పోలీసులు ప్రధాన రహదారులపై అడ్డంకులు ఏర్పాటు చేయడంతో, అన్నదాతలు పొలాల వెంబడి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. పోలీసులు ఆంక్షలు విధించి అదుపులోకి తీసుకుంటున్నా.. నీళ్ల కోసం రైతులు చూపిస్తున్న తాపత్రయం అందరినీ కదిలిస్తోంది.
లీడర్ల ముందస్తు అరెస్టులు
రైతులతో కలిసి ధర్నాకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నాయకులను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజుకుంటున్న నీటి పోరాటం
ఒక్క జూరాల మాత్రమే కాకుండా కోయిల్ సాగర్, సంగంబండ రిజర్వాయర్ల కింద ఉన్న కాలువలకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 100 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా వదిలేయడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోతోందని, స్థానిక రైతులకు అన్యాయం జరుగుతోందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కానీ ఇరిగేషన్ అధికారులు కానీ సాగునీటి విడుదలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో అసహనం, ఆందోళన మరింత తీవ్రమవుతున్నాయి.












