Shopping Mall Opening: షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించిన రూ.9 చీరల ఆఫర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రారంభోత్సవ వేళ చీరల కోసం మహిళలు ఎగబడటంతో భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'గరుడ షాపింగ్ మాల్' ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రారంభించారు. హీరోయిన్ రాకతో పాటు, ఓపెనింగ్ సందర్భంగా కేవలం రూ.9లకే చీర అందిస్తున్నామంటూ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఈ ప్రచారంతో ఉదయం నుంచే వేలాది మంది మహిళలు షాపింగ్ మాల్ వద్దకు పోటెత్తారు. ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే లోపలికి వెళ్లేందుకు మహిళలు ఒక్కసారిగా గేట్ల వైపు దూసుకురావడంతో పెద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. జనాన్ని అదుపు చేయడంలో సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా చేతులెత్తేశారు.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రచారం కోసం నిర్వాహకులు సరైన ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఆఫర్లు ప్రకటించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








