KTR: జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కళ్లముందే ఎండిపోతున్న పంటలకు సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పనికిరాని కుంటిసాకులతో రేవంత్ సర్కార్ పచ్చని పంటల ఉసురు తీస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాగునీటి అవసరాలకు కేవలం 2 టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, మిగిలిన నీటిని ఆయకట్టుకు ఇవ్వకుండా రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.
అన్నదాతలపై అక్రమ కేసులా
చేతికొచ్చిన పంటలు నాశనమవుతుంటే తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించడం రేవంత్ ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడు విని వారికి అండగా నిలవాల్సింది పోయి, కేసులు పెట్టి అరిగోస పెట్టడం దుర్మార్గమన్నారు.
పోరాడుతున్న నేతల నిర్బంధం దుర్మార్గం
జూరాల ఆయకట్టుకు నీరిచ్చి పంటలను కాపాడాలని రైతుల తరఫున క్షేత్రస్థాయిలో నిరసనలకు సిద్ధమైన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను అక్రమంగా నిర్బంధించడం చూస్తుంటే రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిర్బంధాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయడంతో పాటు, మొండివైఖరి వీడి జూరాల నుంచి వెంటనే సాగునీటిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆగ్రహ జ్వాలల ముందు ఏ ప్రభుత్వమూ నిలబడలేదని, అన్నదాతల ఉసురు తగిలి కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు












