తెలంగాణ

ఇప్పుడే జూరాల నీరు వదిలేస్తే.. వేసవిలో తాగేందుకు కూడా నీళ్లు దొరకవు- మంత్రి జూపల్లి

రచన: NK6 నిమిషాల పఠనం

Jurala Water: జూరాలలో నీటి ఎద్దడిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. జూరాలలో నీటి ఎద్దడి వాస్తవమే అని చెప్పారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడమే ఇందుకు కారణం అని వివరించారు. నీటి విడుదలకు కర్నాటక సీఎంతో మాట్లాడామని, ఆల్మట్టి నుంచి ఇవ్వాలని కోరామన్నారు.

Jurala Water: జూరాలలో నీటి ఎద్దడిపై రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. జూరాలలో నీటి ఎద్దడి వాస్తవమే అని చెప్పారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడమే ఇందుకు కారణం అని వివరించారు. నీటి విడుదలకు కర్నాటక సీఎంతో మాట్లాడామని, ఆల్మట్టి నుంచి ఇవ్వాలని కోరామన్నారు. జూరాల నీటి విషయంలో బీఆర్ఎస్ కావాలనే రైతులను రెచ్చగొడుతోందని మంత్రి జూపల్లి ఆరోపించారు. కృష్ణా జలాలను తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ వాడుకుంటోందని బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు.

వేసవిలో తాగునీటికి ఎలా కేటీఆర్?

పదేళ్ల పాలనలో పాలమూరు రైతుల కోసం ఎందుకు ఒక్క రిజర్వాయర్ కూడా కట్టలేదని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. తాము ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పుడు జూరాల నుంచి నీటిని విడుదల చేస్తే వచ్చే వేసవిలో తాగేందుకు కూడా నీళ్లు దొరకవని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

ఆరుతడి పంటలు వేసుకోవాలని పదేపదే చెప్పాం

''ఎల్ నినో కారణంగా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూరాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహం లేదు. జూరాల కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి నీటి ఎద్దడి మాట వాస్తవమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు రైతాంగానికి పదే పదే విజ్ఞప్తి చేశాం. ఎల్ నినో ప్రభావం ఉంది, కరవు వస్తుంది, ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రతి సందర్భంలో రైతాంగానికి మొదట్లోనే సూచించాము. పదే పదే వారికి విజ్ఞప్తి కూడా చేశాం.

ఈ దుస్థితికి కారణం బీఆర్ఎస్

నీటి విడుదల కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కర్నాటక ముఖ్యమంత్రితో కూడా మాట్లాడాము. ఆల్మట్టి నుంచి నీరు ఇవ్వాలని కోరాము. మీకు కనపడనంత మాత్రాన, వినపడనంత మాత్రాన ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అనడం కరెక్ట్ కాదు. 2027 జూన్ జూలై వరకు తాగునీటి అవసరాల కోసం నీరు కావాలి. కేటీఆర్ డిమాండ్ చేసినట్లు జూరాలలో ఉన్న నీటిని వదిలేస్తే వచ్చే వేసవిలో తాగునీటికి అవసరం లేదా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దొంగే దొంగ అని అరిచినట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉంది. ఈ దుస్థితికి కారణం బీఆర్ఎస్ వాళ్లే. తిరిగి మా ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసం? కేటీఆర్ కు అసలు అవగాహన ఉందా? కల్వకుర్తికి సంబంధించి మోటార్లు రెగులర్ గా నడుస్తున్నాయి'' అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

పదేళ్లలో ఎందుకు ఒక్క రిజర్వాయర్ నిర్మించలేదు?

8 లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల కింద ఎందుకు ఒక్క రిజర్వాయర్ నిర్మించలేని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. కల్వకుర్తి లిఫ్ట్ కింద నాలున్నర టీఎంసీలతో 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎలా నీరిద్దామనుకున్నారని నిలదీశారు. జురాల ఆయకట్టుకు నీళ్లు రాకపోవడానికి గత పదేళ్ల బీఆర్ఎస్ సర్కారు ఉదాసీనతే కారణమని ధ్వజమెత్తారు.

ప్రజా ప్రభుత్వంలో 15 టీఎంసీలతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. జురాల, భీమా ఆయకట్టుకు జలాల కోసం సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్‌దిన్నె రిజర్వాయర్ వరకు కాలువను నిర్మిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. గతంలో గట్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లు కట్టి ఉంటే ఇప్పుడు నీళ్ల సమస్య వచ్చేది కాదని కేటీఆర్‌కు హితవు పలికారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

#Jurala Water#Ktr#Jupally Krishna Rao#Brs#Telangana Congress#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి