Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే తక్షణ ఉపశమనం కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్‌ను వెంటనే అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని పక్కనపెట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనం, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఉప ఎన్నిక ముప్పు..
దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ కేసు తీవ్రతను వివరించారు. స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు నేరుగా అనర్హత వేటు వేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని స్టే ఇవ్వకపోతే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయి, ఉప ఎన్నిక వచ్చే ప్రమాదం పొంచి ఉందని అత్యవసర విచారణను కోరారు.
అయితే ప్రతివాదులైన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ క్లయింట్లు ముందస్తుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారని, తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన సీజేఐ ధర్మాసనం.. తక్షణ స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, పూర్తిస్థాయి విచారణను బుధవారం చేపడతామని స్పష్టం చేసింది.
ఉత్కంఠ రేపుతున్న బుధవారం విచారణ
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా, ఎంపీగా కూడా పోటీ చేసిన దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయం పైనే దానం రాజకీయ భవితవ్యంతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆధారపడి ఉంది. బుధవారం నాటి విచారణలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందా లేక సమర్థిస్తుందా అన్న అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.












