TG: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా దూకుడు ప్రదర్శించాల్సిన బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ విసిరిన ట్రాప్‌లో చిక్కుకుపోయిందా? అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై సర్కార్‌ను ఇరుకున పెట్టాలని భావించిన గులాబీ నేతలు.. ఇప్పుడు అధికార పార్టీ సంధించిన భూ ఆరోపణల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ప్రజాక్షేత్రంలో లేవనెత్తాల్సిన కీలక అంశాలను పక్కనపెట్టి, తమ ఆస్తులను కాపాడుకోవడానికి, భూ ఆరోపణలను సమర్థించుకోవడానికే సమయం కేటాయిస్తుండటంతో ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతోందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
ప్రజా సమస్యలు మరచి.. భూముల రక్షణలోనే
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ భూముల సమస్యతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ పక్కా ప్లాన్ చేసింది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. గులాబీ పార్టీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని అధికార పక్షం సంధించిన భూ ఆరోపణలు బీఆర్ఎస్ శిబిరాన్ని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి. ఆ ఆరోపణలు నిజం కావని నిరూపించుకునేందుకు, మీడియా సమావేశాలు పెట్టి లెక్కలు చెప్పేందుకే ఆ పార్టీ నాయకులకు సరిపోతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రజల్లో పెరిగిపోతున్న అనుమానాలు.. ఇమేజ్ డ్యామేజ్ తప్పదా
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ప్రజా సమస్యల కోసం పోరాడాల్సింది పోయి, తమ సొంత భూముల చుట్టూనే సమాధానాలు ఇచ్చుకుంటూ తిరిగితే అది అంతిమంగా ప్రజల్లోకే తప్పుడు సంకేతాలు పంపుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఎంత క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నా.. ప్రజల్లో మాత్రం ‘వీరి భూముల వ్యవహారం ఏంటి?’ అనే చర్చే రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కాంగ్రెస్ వ్యూహం పక్కాగా అమలై, గులాబీ పార్టీ ఇమేజ్ క్రమంగా డ్యామేజ్ అవుతోందన్న చర్చ స్టార్ట్ అయ్యింది.
భూముల రచ్చ నుంచి బయటపడేందుకే మళ్లీ ‘నీళ్ల సెంటిమెంట్’?
భూ ఆరోపణలతో ఇరుకున పడ్డ బీఆర్‌ఎస్, ఈ నష్టనివారణ కోసం మళ్లీ పాత అస్త్రాన్ని బయటకు తీసిందా అనే కొత్త చర్చ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ప్రజల దృష్టిని తమ ఆస్తుల పంచాయితీ నుంచి మళ్లించేందుకే హఠాత్తుగా ‘కృష్ణా జలాల సెంటిమెంట్’ను గులాబీ పార్టీ నేతలు బయటికి తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుప్పంకు కృష్ణా నీళ్లు తరలిపోతుంటే పాలమూరుకు ఎందుకు ఇవ్వరంటూ హరీశ్ రావు నేతృత్వంలో సాగిన హడావుడి, నిరసనల వెనుక అసలు ఉద్దేశం ఇదేనన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. భూముల కబ్జా ఆరోపణలతో వస్తున్న డ్యామేజ్‌ను కవర్ చేసేందుకు నీళ్ల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది. మరి కాంగ్రెస్ పన్నిన ఈ రాజకీయ వ్యూహాన్ని ఛేదించి, బీఆర్‌ఎస్ మళ్లీ ప్రజా పక్షాన బలంగా నిలబడుతుందో లేక ఈ ఆరోపణల ట్రాప్‌లోనే మరింత నష్టపోతుందో కాలమే సమాధానం చెప్పాలి.












