Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ దాదాపు 750 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా ప్రపంచ రికార్డును సాధించడం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం. విఎఫెక్స్ రంగంలో అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఏకంగా 37 మంది పర్‌ఫార్మర్లను ఒకేసారి రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేసి ఈ సినిమా బృందం సరికొత్త రికార్డుని సాధించింది.
ఈ ఘనత సాధించినందుకు గానూ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సర్టిఫికేట్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ చిత్ర దర్శకుడు అట్లీ తాజాగా అందుకున్నారు. టెక్నాలజీ పరంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ సరికొత్త ప్రయోగంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్’ విభాగంలో ఈ రికార్డు సాధించడం విశేషం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంచలన విజయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో, ‘రాకా’ మూవీపై అంచనాలు తారా స్థాయిలో రెట్టింపయ్యాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినీ ప్రియులు, అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పడుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, రాకా చిత్రాన్ని అట్లీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం, ముంబైలోనే రాకా షూటింగ్ అంతా జరుపుతున్నారు. 2028 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది, అధికారికంగా వెల్లడి కానప్పటికీ..2027 లో రాకా రావడం సాధ్యపడని అంటున్నారు. గ్రాండ్ విజువల్ వండర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి వందలమంది వీఎఫెక్స్ బృందం పనిచేస్తోంది. మరి, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.












