Cancer Awareness: చాలా మంది వారి పూజ గదిల్లో దేవుడి ఫోటోల ముందు అగరబత్తి వెలిగించని మొక్కులు చెల్లించుకోవడం సాధారణంగా మనం చూస్తుంటాం. సువాసనల కోసం, పవిత్రత కోసం నిత్యం ధూపం వేయడం ఎప్పటి నుంచో వస్తున్న మన సంప్రదాయం.
మరోవైపు రాత్రిపూట దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి దోమల కాయిల్స్ వెలిగించి నిద్రపోవడం కూడా కామన్. అయితే ఈ పొగను పీల్చడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ వస్తుందా? సిగరెట్ కంటే ఈ పొగే అత్యంత ప్రమాదకరమా? అనే భయాందోళనలు సోషల్ మీడియా వేదికగా నిత్యం కలకలం రేపుతూనే ఉన్నాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? వైద్య నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి..
ఆ పొగలో ఏముంది
అగరబత్తులు, దోమల కాయిల్స్ కాలినప్పుడు కేవలం సువాసన మాత్రమే వెలువడదు. వాటి నుంచి అతి సూక్ష్మ కణాలు, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు గాలిలోకి రిలీజ్ అవుతాయి. ఈ కణాలు గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉండటం వల్ల శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. కొన్ని అధ్యయనాలు ఈ పొగకు, శ్వాసకోశ క్యాన్సర్లకు సంబంధం ఉండొచ్చని సూచించినప్పటికీ, కేవలం వీటివల్ల మాత్రమే నేరుగా క్యాన్సర్ వస్తుందని నిర్ధారించడానికి ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మెడికల్ ఆంకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.
క్యాన్సర్ అనేది ఒక్క రాత్రిలోనో లేదా ఏదో ఒక పొగ పీల్చినంత మాత్రాన వచ్చేది కాదని చెబుతున్నారు. దానికి జన్యుపరమైన లోపాలు, పొగాకు, స్మోకింగ్, తాగుడు, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, పర్యావరణ కాలుష్యం వంటి ఎన్నో అంశాలు కారణమవుతాయని వెల్లడిస్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు వెలిగించే అగరబత్తికి అనవసరంగా భయపడాల్సిన పనిలేదు.
అసలైన ముప్పు అక్కడే
అయితే క్యాన్సర్ ముప్పు నేరుగా లేకపోయినా.. ఈ పొగ ఇంట్లోని గాలి నాణ్యత దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణమవుతోందని అంటున్నారు. ముఖ్యంగా కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేసి, గాలి ఆడని గదుల్లో దోమల కాయిల్స్ లేదా అగరబత్తులు వెలిగిస్తే అది ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బయటకు వెళ్లలేని పొగ గదిలోనే పేరుకుపోయి, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత చేటు చేస్తుందని అంటున్నారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు
సంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకుంటూ వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను సూచిస్తున్నారు. అగరబత్తులు లేదా కాయిల్స్ వెలిగించినప్పుడు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. గాలి బాగా ఆడే ప్రదేశాల్లోనే వీటిని ఉపయోగించాలి. అలాగే ఒకేసారి పదుల సంఖ్యలో అగరబత్తులు గుప్పెడుగా వెలిగించకుండా ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
బెడ్‌రూమ్‌లలో రాత్రంతా దోమల కాయిల్స్ పొగను పీల్చడం ప్రమాదకరం. వాటికి బదులుగా మస్కిటో నెట్స్ (దోమతెరలు) వాడటం అత్యంత సురక్షితమైన మార్గం అని చెబుతున్నారు.
పొగ రాని ఎలక్ట్రిక్ వేపరైజర్లు లేదా తక్కువ పొగ వెలువడే నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. పొగ అనేది ఏదైనా ఊపిరితిత్తులకు భారమే అని చెబుతున్నారు. అగరబత్తి వాసన మంచిదే అయినా, అది పరిమితి దాటితే ఇంట్లోనే కాలుష్యాన్ని పెంచుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అనవసర భయాలు పక్కనపెట్టి, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకుంటే పొగతో ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు.












