* రూ.327 కోట్లతో కుప్పంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
* ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష అని రైతులకు పిలుపు
* ప్రతి ఇంటినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యాచరణ
* స్వర్ణ కుప్పం దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళిక
Kuppam: నారావారిపల్లె తనకు జన్మనిస్తే… కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా, స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గడిచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కుప్పం నుంచే ఏ పని చేయాలన్నా నాంది పలుకుతామని చంద్రబాబు చెప్పారు.
హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు
కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని 550కు పైగా చిన్న నీటిపారుదల చెరువులను లిఫ్ట్ ఇరిగేషన్, పైప్‌లైన్లతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. యామిగానిపల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
రూ.45 కోట్లతో రిజర్వాయర్
బీరువానిపల్లి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా రూ.45 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశుదాణాకు ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం తెలిపారు.
రైతులు అధికంగా రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ పంటలు, సూక్ష్మ సాగునీటి విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష అనే విధానంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలతో పాటు పశుపోషణ, పౌల్ట్రీ, ఉద్యాన పంటలపై దృష్టి పెడితే రైతులు, మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టాప్
కుప్పాన్ని నెట్‌జీరో నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సహా అన్ని భవనాలు నెట్‌జీరో దిశగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసి.. ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారేలా చర్యలు చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
కుప్పంలో 8,904 బంగారు కుటుంబాలను గుర్తించి పీ4 కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు. కుప్పాన్ని పేదరికం లేని నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యమన్నారు. టీవీఎస్, అదానీ, మెగా తదితర సంస్థలు 8,900కుపైగా కుటుంబాలను దత్తత తీసుకుని వాటి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తయారవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
కుప్పంలో ఇప్పటికే 32 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు లభించేలా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌తో పాటు మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా కూడా నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు.
కుప్పం అభివృద్ధికి భారీ ప్రణాళిక
రెండు నెలల క్రితం కుప్పంలో రూ.7,939 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని సీఎం గుర్తుచేశారు. తాజాగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మరో రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా భూమిపూజ నిర్వహించినట్లు చెప్పారు. కుప్పంలో ఎక్కడా చెత్త కనిపించకుండా పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. 82 ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా చెత్త నుంచి కంపోస్టు తయారు చేస్తున్నామని చెప్పారు.
రూ.3.30 కోట్లతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను చంద్రబాబు ప్రారంభించారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమిపూజ చేశారు. కుప్పం మార్కెట్ యార్డులో రూ.2.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో హైమాస్ట్ వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్లు, అండర్‌గ్రౌండ్ యుటిలిటీ వ్యవస్థ, బీటీ, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్థానిక ఉత్పత్తుల విక్రయానికి ఆధునిక రైతు బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
కుప్పం కనెక్టివిటీకి పెద్దపీట
కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచేలా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆ సౌకర్యాన్ని కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. బెంగళూరు, చెన్నై, కేజీఎఫ్, కృష్ణగిరి ప్రాంతాలను అనుసంధానించేలా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. కుప్పం-పొగురుపల్లి నుంచి బెంగళూరుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. చిత్తూరు నుంచి కుప్పానికి బ్రాడ్‌గేజ్ రైలు మార్గం కల్పించాలని రైల్వే శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. కుప్పంలో ఉత్పత్తయ్యే వస్తువులు కృష్ణపట్నం పోర్టుకు చేరేలా కనెక్టివిటీని మరింత పెంచుతున్నామని చెప్పారు.
కుప్పంలో విమానాశ్రయం
భవిష్యత్తులో కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా పౌరుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో ఇప్పటికే వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ రికార్డులు నమోదు చేసి చికిత్సలు అందిస్తున్నామని వివరించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఇల్లు, ఇంటి స్థలం అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కంగుందిలో దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యను పరిష్కరించి 320 మందికి పట్టాలు అందించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాలు జారీ చేస్తున్నామని చెప్పారు.
ప్రజలతో ముఖాముఖి
కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు, గృహిణులు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. హంద్రీనీవా కాలువ ద్వారా అందుతున్న నీటితో కలుగుతున్న ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని లైవ్ వీడియో ద్వారా సభకు చూపించారు. కుప్పం అభివృద్ధిపైనా నిర్వహించిన వీడియో కాంటెస్ట్ లో విజేతలైన సుబ్రహ్మణ్యం, విక్కీలను సీఎం సత్కరించి అభినందించారు.












