HMWSSB: హైదరాబాద్ నగరవాసులకు జలమండలి తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ఓవైపు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క శివార్లలో జనం అల్లాడుతుంటే, మరోవైపు తాగునీటితో కార్లు కడగడం, రోడ్లు, ఫ్లోర్లు క్లీన్ చేస్తూ నీటిని విచ్చలవిడిగా వృథా చేసేవారి ఆటలు ఇకపై సాగబోవని తేల్చి చెప్పింది. విలువైన తాగునీటిని వృథా చేస్తే భారీ ఎత్తున జరిమానాలు విధించడమే కాకుండా, రెండోసారి మిస్ యూజ్ చేస్తూ దొరికితే ఏకంగా తాగునీటి కనెక్షన్‌నే శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరిస్తూ సరికొత్త రూల్స్‌ను ప్రకటించింది.
జూబ్లీహిల్స్‌లో మహిళకు రూ.20 వేల జరిమానా
కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జలమండలి ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం నీటి సరఫరా వేళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో తాగునీటిని వృథా చేస్తున్న ఐదుగురిని పట్టుకుని అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించారు. ఇటీవల ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని ఇష్టారాజ్యంగా వాడుతున్న ఓ మహిళకు ఏకంగా రూ.20,000 ఫైన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను బట్టి మొదటి దశలో రూ.1,000 నుంచి మొదలుపెట్టి రూ.5 వేలు, రూ.10 వేలు, గరిష్టంగా రూ.20 వేల వరకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. మొదటిసారి దొరికితే జరిమానాతో వదిలిపెడతామని, అదే వ్యక్తి మళ్లీ నీటిని వృథా చేస్తూ పట్టుబడితే నల్లా కనెక్షన్ పీకేస్తామని అల్టిమేటం జారీ చేశారు.
లీకేజీలకు 24 గంటల డెడ్‌లైన్..
ప్రజలకే కాదు, తమ శాఖలోని ఉద్యోగుల నిర్లక్ష్యంపైనా జలమండలి కొరడా ఝళిపించింది. నగరవ్యాప్తంగా సుమారు 15 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే, సమాచారం అందిన 24 గంటల్లోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలో రెస్పాన్స్ కాకుండా నిర్లక్ష్యం చేస్తే సంబంధిత లైన్‌మెన్లు, అధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో ప్రతి నీటి బొట్టునూ సంరక్షించుకోవాలని.. నీటి వృథాకు పాల్పడి భారీ జరిమానాలు, కనెక్షన్ కోతలకు గురికావద్దని అధికారులు ప్రజలను కోరుతున్నారు.











