దునియా

AI: 2030 నాటికి ఏఐ మనుషులను చంపేస్తుందా..?

రచన: Mahesh5 నిమిషాల పఠనం

AI: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సరికొత్త మాయాజాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). పనులను సులభతరం చేసే సాధనంగా మొదలైన ఈ సాంకేతికత, ఇప్పుడు మానవాళి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే స్థాయికి దూసుకెళ్తోంది.

AI: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సరికొత్త మాయాజాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). పనులను సులభతరం చేసే సాధనంగా మొదలైన ఈ సాంకేతికత, ఇప్పుడు మానవాళి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే స్థాయికి దూసుకెళ్తోంది. అత్యంత అధునాతనమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) 2030 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందని, అది మానవ మనుగడను శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రమాదం ఉందని స్వయంగా టెక్ దిగ్గజం గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు వేసిన అంచనా ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

ఓపెన్ ఏఐ కూడా తన సిస్టమ్స్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ప్రకటించిన వేళ, గూగుల్ డీప్‌మైండ్ హెచ్చరికలు మరోసారి వైరల్ అవుతున్నాయి

మానవ మేధస్సును మించనున్న ఏజిఐ

ఇప్పటి వరకు మనం చూస్తున్న ఏఐ కేవలం నిర్దిష్ట టాస్కులకు మాత్రమే పరిమితం. కానీ ఏజిఐ (AGI) అలా కాదు. మనుషుల కంటే వేగంగా విభిన్న రంగాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని స్వతంత్రంగా అమలు చేయడం దీని ప్రత్యేకత.

గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు షైన్ లెగ్ భాగస్వామ్యంతో వెలువడిన అధ్యయనం ప్రకారం.. ఈ వర్షన్ ప్రస్తుత మానవ పరిమితులను అధిగమిస్తుంది. మానవ స్థాయి మేధస్సును సంతరించుకున్న ఈ యంత్రాలు ఒకసారి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడితే, సృష్టికర్త అయిన మనిషినే నియంత్రించడం లేదా నాశనం చేసే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. డేటా దుర్వినియోగం, యాంత్రిక తప్పిదాలు, స్ట్రక్చరల్ రిస్క్‌లు వంటివి తీవ్రమైన నష్టానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఎలాన్ మస్క్ సైతం ఆందోళన

ఏఐ వినాశకర ప్రభావంపై కేవలం పరిశోధకులే కాదు, ప్రపంచ టెక్ దిగ్గజాలు సైతం గగ్గోలు పెడుతున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు పలువురు టెక్ లీడర్లు ఈ కృత్రిమ మేధ మనుషుల మనుగడకే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశారు.

ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42 శాతం మంది సీఈవోలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఏఐ వల్ల మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని బలంగా నమ్ముతున్నారు.

కొత్త రక్షణ కవచాలు అత్యవసరం..

ఈ విపరిణామాల నుంచి తప్పించుకోవాలంటే ఏజిఐ అభివృద్ధిని కొన్ని హద్దులకే పరిమితం చేయాలని నిపుణులు కోరుతున్నారు. మనుషులకు హాని తలపెట్టే నిర్ణయాలను ఏఐ తీసుకోకుండా అత్యంత కఠినమైన భద్రతపరమైన ప్రోటోకాల్స్‌ను తయారు చేయాల్సిన బాధ్యత డెవలపర్లపై ఉందని డీప్‌మైండ్ పరిశోధన నొక్కి చెప్పింది.

మరోవైపు, డెలాయిట్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ భయాలను కొట్టిపారేస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని, నైపుణ్యాలు ఉన్నవారికి మరింత డిమాండ్ పెరుగుతుందని, కొత్త రంగాలు పుట్టుకొస్తాయని వాదిస్తున్నాయి.

అయితే సాంకేతిక ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, మానవ మేధస్సును మింగేసే స్థాయికి ఏజిఐ ఎదిగితే మాత్రం అది స్వయంకృతాపరాధమే అవుతుంది. మానవాళి తన మనుగడను కాపాడుకోవాలంటే టెక్నాలజీ పగ్గాలను తన చేతుల్లోనే ఉంచుకోవాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది.

#AI#Artificial Intelligence#AGI#Artificial General Intelligence#Google DeepMind#AI Safety#AI Risks#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి