దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ చిన్న చిన్న తప్పుల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడాన్ని తాజాగా సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తప్పుబట్టారు.ఓటరు జాబితాలో పేరు లేని వారి ఓట్లు డిలీజ్ చేయడంతో పాటు ఓటు ఉన్నవారికి మిస్టేక్స్ పేరిట నోటీసులు ఇచ్చి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎన్నికల సంఘం తీరు ఉందని సెటైర్లు వేశారు. ఓటర్ల హక్కులను కాపాడేలా ఈసీ పనిచేయడం లేదన్నారు. ఓటర్లను అవమానించేలా ఈసీ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేస్తున్న వింత, వికృత చర్యలు ప్రజల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఓటర్ల వివరాల్లో సాంకేతిక తప్పులు ఉంటే వాటిని సరిచేయాలి కానీ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మాజీ ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ వంటి ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వడం ఏ విధమైన ఓటరు జాబితా ప్రక్షాళన? అని నిలదీశారు. ఓటర్ల పేరులోని స్పెలింగ్ మిస్టేక్స్, వివాహం తర్వాత మహిళల ఇంటిపేరు మారడం వంటి సహజమైన మార్పులను కూడా సమస్యలుగా చూపించడం సమంజసమా? అని అడిగారు.
తాతముత్తాతల పుట్టిన తేదీలను వెతకడం మరీ విడ్డూరం కాదా? అని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల హక్కును కాపాడే విధంగా ఉండాలని, వారి ఓటు హక్కును అవమానించేలా ఉండొద్దన్నారు. ఎన్నికల సంఘం కోట్లాది ఓటర్ల హక్కుల విషయంలో అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అంతేగానీ, ప్రధాన మంత్రి కార్యాలయం ఆడించే ‘సురభి నాటకం’లో అపవిత్ర పావుగా మారకూడదని హితవు పలికారు.












