తెలంగాణ

Hyderabad: లైసెన్స్ సెక్షన్‌లో నగదు లెక్కలు.. బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా!..

రచన: Venu4 నిమిషాల పఠనం

లైసెన్స్ జారీ సెక్షన్‌లో అరుణ్ పెద్ద మొత్తంలో 500 రూపాయల నోట్లను లెక్కిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఓ వాహనదారుడు ఈ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అనే మహమ్మారి ఎంతలా పాతుకుపోయిందో.. రోజురోజుకూ వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాల్లోనే కొందరు లంచావతారులు మితిమీరిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని చేయాలంటే నిబంధనలు కాదు.. నోట్ల కట్టలే మార్గమనే పరిస్థితి ఏర్పడితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం చుట్టూ ఇలాంటి ఆరోపణలే తీవ్ర చర్చకు దారితీశాయి. రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్ భారీగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లైసెన్స్ జారీ సెక్షన్‌లో అరుణ్ పెద్ద మొత్తంలో 500 రూపాయల నోట్లను లెక్కిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఓ వాహనదారుడు ఈ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే వీడియోలో కనిపిస్తున్న నగదు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పని కోసం తీసుకున్నారు? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే సమయంలో కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి మరో రకమైన ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అన్ని పత్రాలు సమర్పించినా చిన్నచిన్న లోపాలను చూపిస్తూ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అదే పనిని మధ్యవర్తుల ద్వారా చేయిస్తే మాత్రం ప్రక్రియ వేగంగా పూర్తవుతోందని మరికొందరి వాదన.

దీంతో బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో సాధారణ నిబంధనల ప్రక్రియే కొనసాగుతోందా.. లేక బ్రోకర్ల వ్యవస్థ ప్రభావం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొందరు బాధితులు స్వయంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

అయితే వైరల్ వీడియోలో కనిపిస్తున్న నగదుకు.. కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న వసూళ్లకు నేరుగా సంబంధం ఉందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అందుకే అసలు నగదు మూలం ఏమిటి? దాని వెనుక ఎవరున్నారు? కార్యాలయ కార్యకలాపాలతో సంబంధం ఉందా? అనే విషయాలపై సమగ్ర విచారణ అవసరం.

ఒకవైపు సామాన్యులను పత్రాల పేరుతో తిప్పుతున్నారనే ఆరోపణలు.. మరోవైపు కార్యాలయంలోనే భారీగా నగదు లెక్కిస్తున్న దృశ్యాలు.. బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం చుట్టూ నెలకొన్న అనుమానాలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణలో వాస్తవాలు బయటపడితే.. ఆరోపణల వెనుక అసలు కథ ఏంటో తేలిపోనుంది..

#Hyderabad#Transport Department#Bandlaguda#RTO office#licensing section#Cash dealings#illegal collections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి