Harish Rao: కృష్ణా జలాల తరలింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ రైతాంగం కష్టాలపై కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. శ్రీశైలం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వరకు కృష్ణా జలాలు నిరాటంకంగా తరలిపోతుంటే, కళ్లముందే ఉన్న పాలమూరు నేలలకు మాత్రం చుక్క నీరు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇది పాలకుల చేతగానితనానికి నిదర్శనమని, స్వయంగా ‘పాలమూరు బిడ్డ’ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక రైతులకు చేస్తున్న తీరని నమ్మకద్రోహమని విమర్శించారు.
పోలీసు పహారాలో జూరాల..
జూరాల ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడాలని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన బాట పట్టిన అన్నదాతలను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీళ్లు అడిగిన రైతన్నల చేతులకు సంకెళ్లు వేయడం, ప్రాజెక్టుల వద్ద ఖాకీ బలగాలను మోహరించి భయానక వాతావరణం సృష్టించడం సిగ్గుచేటని అన్నారు.
ప్రాజెక్టులు నిర్మిస్తే.. నీళ్లు నింపే సోయి లేదా
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పట్టుబట్టి పాలమూరు ప్రాజెక్టు కింద నార్లపూర్, ఏదుల, కరివెన, వట్టెం రిజర్వాయర్ల ద్వారా దాదాపు 50 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని సిద్ధం చేశారని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నా, నదిలో సమృద్ధిగా వరద ప్రవాహాలు నమోదైనా మోటర్లు నడపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే నేడు ప్రాజెక్టులన్నీ నిరుపయోగంగా మారాయని, ప్రభుత్వ తప్పిదాలకు అమాయక రైతులు పంటలు కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాకుల పాలన వీడి.. నీటిని విడుదల చేయాలి
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 8.4 టీఎంసీల మేర నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, గేట్లు ఎత్తి పొలాలకు నీరివ్వడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, 'ఎల్ నినో' వంటి వంకలతో రైతుల సమస్యల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ఎండిన పైర్లను చూసి గుండెలవిసేలా రోదిస్తున్న అన్నదాతల కన్నీరు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని, నిర్బంధించిన రైతులు, బీఆర్‌ఎస్ నేతలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.












