దీపావళి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న విమాన ప్రయాణికులకు ఏవియేషన్ సంస్థలు గట్టి షాక్ ఇస్తున్నాయి. అధిక పండగ డిమాండ్, విమాన ఇంధన (ATF) ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ చార్జీలు ఆకాశాన్నంటాయి. ప్రధాన నగరాల మధ్య సర్వీసుల్లో గతంతో పోలిస్తే టికెట్ ధరలు రెట్టింపు కంటే అధికంగా నమోదు కావడంతో పండగ ప్రయాణం సామాన్యులకు తీవ్ర భారంగా మారింది.
దేశీయంగా ప్రధాన రూట్లలో ప్రయాణ చార్జీల మోత తీవ్రంగా ఉంది. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-బెంగళూరు మార్గంలో సాధారణ రౌండ్-ట్రిప్ టికెట్ ధర రూ. 13,000 వరకు ఉండగా, ప్రస్తుతం పండగ సీజన్‌లో ఏకంగా రూ.20వేలు దాటిపోయింది. కొన్ని మార్గాల్లోనైతే సాధారణ రోజులతో పోలిస్తే 300శాతానికి పైగా ధరలు పెరిగాయి. కోల్‌కతా-దేవ్‌గఢ్ మార్గంలో సాధారణంగా రూ. 2,800 ఉండే టికెట్ ధర పండగ రద్దీ దృష్ట్యా ఏకంగా రూ.12,500కి చేరడమే దీనికి స్పష్టమైన నిదర్శనం.
అంతర్జాతీయ మార్గాల్లోనూ ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమాన సర్వీసుల ధరలు గణనీయంగా పెరిగాయి. నవంబర్ 5న దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ ధర ఆయా సంస్థలను బట్టి రూ.26,424 (1,013 దిర్హమ్‌లు) నుంచి రూ. 31,667 (1,214 దిర్హమ్‌లు) వరకు పలుకుతోంది. విమాన ఇంధన ధర సెప్టెంబర్‌లోనే లీటర్‌పై 5.46 శాతం పెరిగి రూ.121.28కి చేరడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ భారం పెరగడమే ఈ ఛార్జీల పెంపునకు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ చార్జీల మోతపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు పలు ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నాయి. వారాంతాలకు బదులుగా వారంలో సాధారణ రోజుల్లో ప్రయాణించడం, ముందుగానే ధరల అలర్ట్స్ సెట్ చేసుకోవడం, లగేజీ పరిమాణాన్ని తగ్గించుకోవడం లేదా ప్రత్యామ్నాయంగా సమీప విమానాశ్రయాలు, రైలు ప్రయాణాలను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.












