Jurala Water: తెలంగాణ రైతులను ఆగం చేయొద్దని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రేవంత్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. జూరాల జలాలు తెలంగాణ రైతులకే చెందాలని ఆయన డిమాండ్ చేశారు. తాగునీటికి 2 టీఎంసీలు పోను.. మిగతా నీటిని సాగుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, జూరాల ప్రాజెక్ట్ దగ్గర ధర్నాకు వెళ్లకుండా మాజీమంత్రి నిరంజన్ రెడ్డిని పోలీసులు వనపర్తిలో గృహ నిర్బంధం చేశారు.
జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. జూరాల ముట్టడికి వెళ్లకుండా తనను వ్యవసాయ క్షేత్రంలోనే పోలీసులు నిర్బంధించారని, అక్కడి నుంచి వనపర్తిలోని తన నివాసానికి తరలించి గృహ నిర్బంధం చేశారని తెలిపారు. రైతు సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
జూరాలలో 9 టీఎంసీల నీరు
వనపర్తిలో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూరాలలో ప్రస్తుతం సుమారు 9 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. అందులో తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు కేటాయించినా మిగిలిన నీటిని ఆరుతడి పంటలకు వినియోగించే అవకాశం ఉందన్నారు. సంబంధిత సీఈతో మాట్లాడగా 8.4 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పారని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రైతులను ఆగం చేయొద్దు
రైతులకు అవగాహన కల్పించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. జూరాలకు ఈ ఏడాది 244 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని, అందులో ఇప్పటివరకు కేవలం 18 టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నామని పేర్కొన్నారు. ఆలమట్టిలో సుమారు 150 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అక్కడి నుంచి సాగునీరు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల్లో వరి సాగు ఎక్కువగా చేశారని, రైతులను ముందుగా అప్రమత్తం చేయకుండా ఇప్పుడు సాగునీటి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు విద్యుత్ కోతల కారణంగా మోటార్లు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోయారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
రైతుల కోసం పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం సరికాదని నిరంజన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులను పలుచోట్ల గృహ నిర్బంధం చేశారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరెస్టులు చేసినంత మాత్రాన రైతుల ఆవేదనను ఆపలేరన్నారు. పాలమూరు ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కుల పరిరక్షణ కోసం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.













