తెలంగాణ

రణరంగంగా మారిన జూరాల పరిసరాలు.. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల అరెస్టు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ‘జూరాల ప్రాజెక్టు ముట్టడి’ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళనలకు మద్దతుగా డ్యామ్‌పై ధర్నా నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు అడుగడుగునా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ‘జూరాల ప్రాజెక్టు ముట్టడి’ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళనలకు మద్దతుగా డ్యామ్‌పై ధర్నా నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు అడుగడుగునా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. జూరాల ప్రాజెక్ట్ 12 కిలోమీటర్ల పరిధి నుంచి డ్యామ్ మీది వరకు భారీగా బలగాలను మోహరించి, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, పోలీసు వాహనాలను అడ్డుపెట్టి ఆత్మకూరు - గద్వాల ప్రధాన రహదారిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

 ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజాము నుంచే బిఆర్ఎస్ నాయకులు, రైతు ప్రతినిధులను ముందస్తు అరెస్టులు చేశారు. వనపర్తిలోని తన నివాసంలో ఉన్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధం (House Arrest) చేశారు. మరోవైపు, నందిమల్ల క్రాస్ రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు తీవ్రంగా నిరోధించారు.

  రోడ్డుకు అడ్డంగా కట్టెలు, రాళ్లు పేర్చి, పలువురు కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డుగా పడుకుని తమ నిరసన తెలపడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లాలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని గత రెండు రోజులుగా వందలాది మంది పోలీసులతో ప్రభుత్వం దిగ్బంధించిందని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఇన్ని ఆంక్షలు, దిగ్బంధనాల నడుమ కూడా పలువురు రైతులు పోలీసుల పహారాను దాటుకుని జూరాల ప్రాజెక్టు కాలువలోకి దిగి నీటి విడుదలకై నిరసన వ్యక్తం చేశారు.

 అటు గద్వాలలోనూ కాలువలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాల నుంచి రైతులు, నాయకులు ప్రాజెక్టు వైపు రాకుండా రహదారుల వెంట కట్టుదిట్టమైన వాహన తనిఖీలు నిర్వహిస్తుండటంతో పాలమూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు, హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

#JuralaProject#BRSProtest#NiranjanReddyHouseArrest#ChittemRammohanReddy#TelanganaFarmers#JogulambaGadwal#TelanganaNews#JuralaPoliceSiege#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి