వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో పాటు సీఎం యోగి సర్కార్ కూడా యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు అవకాశాలపై ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (Sp), బహుజన సమాజ్ వాదీ పార్టీ(BSP), ఇతర పార్టీలు సైతం రాబోయే యూపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కులాల వారీగా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే రెండు టర్ములు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ పదవీ కాలం పూర్తికానుంది. రెండు సార్లు అక్కడ కమలం పార్టీ అధికారంలో ఉండటం, క్రైమ్ రేటు పెరగడం, నిరుద్యోగ సమస్య వంటి సమస్యలను అస్త్రాలుగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఇండియా కూటమి నేతలు చూస్తున్నారు.వారికి అడ్డుకట్ట వేయాలని అధికార బీజేపీ చూస్తున్నది.
ఈ క్రమంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, యూపీలోని ప్రతిపక్ష పార్టీలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. యూపీలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్, అక్కడి ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా పొత్తు అంశంపై హింట్ ఇచ్చారు. యూపీలో బీజేపీ మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు. కమలం పార్టీని నిలువరించాలనే నిజమైన చిత్తశుద్ధి విపక్షాలకు ఉంటే తమతో కలిసి రావాలని యూపీ రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.
బీజేపీ పవర్‌లోకి అడ్డుకోవడానికి ఏఐఎంఐఎంతో చేతులు కలపాలని ఆయా పార్టీలు, రాజకీయ మిత్రులకు స్పష్టం చేసినట్టు ఒవైసీ తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అందరం ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒవైసీ చేసిన తాజా ప్రతిపాదన యూపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ఒవైసీ ఆఫర్‌పై ఎలా తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.












