హైదరాబాద్ మహానగరంలో మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ఓ వర్గం ప్రజలు యత్నించారు. దీంతో మరోవర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
డబుల్ బెడ్రూం పోలీస్ హౌసింగ్ సొసైటీ వద్ద గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అదే సమయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించారు. ఆ సమయంలో హౌసింగ్ సొసైటీ పై అంతస్తు నుంచి ఓ వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు మాంసపు వ్యర్థ్యాలను కిందకు విసిరారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు.
స్థానికంంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే నేతృత్వంలోని పోలీస్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశాయి. అసలు విషయం తెలుసుకుని హౌసింగ్ సొసైటీలో నివాసముంటున్న మహమ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని డీసీపీ కిరణ్ ఖరే స్పష్టంచేశారు.ఆందోళనకారులు, కాలనీ వాసులతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్టు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని డీసీపీ వెల్లడించారు.గణేశ్ నిమజ్జన వేడుకలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని, ఎలాంటి వదంతులను వ్యాప్తి చేయొద్దని ఈ సందర్భంగా డీసీపీ కిరణ్ ఖరే సూచించారు.











