TG: రాష్ట్రంలో ఎండలు ముదరకముందే నీటి గండం పొంచి ఉంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు రోజురోజుకూ పడిపోతుండటంతో రానున్న రోజుల్లో గొంతెమ్మ కోర్కెలు కాదు కదా.. కనీసం గొంతు తడుపుకోవడానికే నీళ్లు దొరకడం గగనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టిన ప్రభుత్వ యంత్రాంగం, సాగు కంటే మునుముందు తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
డిసెంబర్ దాటితే పరిస్థితి ఏంటి?
ముఖ్యంగా సింగూరు జలాశయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 3.924 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, ఈ నిల్వలు డిసెంబర్ 10 వరకే సరిపోతాయని అధికారులు తేల్చేశారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని దాదాపు 2,395 గ్రామాలు, 19 పట్టణాలు ఈ నీటిపైనే బతుకుతున్నాయి. ఈ నాలుగు జిల్లాల తాగునీటి అవసరాల కోసం రూ.84.14 కోట్లు, హైదరాబాద్లో నీటి కష్టాలు రాకుండా చూసేందుకు మరో రూ.57.55 కోట్లతో ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
రిజర్వాయర్లలో సగం నీరే..
రాష్ట్రంలోని ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల్లో సాధారణంగా 462.6 టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 210.8 టీఎంసీలు (కేవలం 54 శాతం) మాత్రమే అందుబాటులో ఉంది. గత ఏడాదితో పోలిస్తే కృష్ణా బేసిన్లో 42 శాతం, గోదావరి బేసిన్లో 38 శాతం నీటి నిల్వలు పడిపోయాయి. ఇక పల్లెసీమలకు జీవనాధారమైన దాదాపు 44 వేల చెరువుల్లో 40 శాతం చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరే మిగిలింది. ఈ నేపథ్యంలో 2027 జూలై వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా 85 టీఎంసీలను రిజర్వ్లో ఉంచాలని అధికారులు స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు 50 టీఎంసీలు, హైదరాబాద్కు 20 టీఎంసీలు, ఇతర పరిశ్రమలు, పట్టణాలకు 15 టీఎంసీలు పోను.. మిగిలిన నీటినే సాగుకు వాడాలని ప్రతిపాదించారు.
పంట విరామం పాటించాల్సిందేనా?
తాగునీటి అవసరాలు తీరిన తర్వాత మిగిలే 47 టీఎంసీలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాలకు (గోదావరి పరిధిలో 6 లక్షలు, కృష్ణా పరిధిలో లక్ష ఎకరాలు) కేవలం ఒక్క తడి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట విరామం పాటించడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వేసిన పంటలను కాపాడుకోవడానికి మాత్రమే ఆ ఒక్క తడి ఉపయోగపడనుంది. మరోవైపు రాష్ట్రంలోని 3.28 కోట్ల పశుసంపదకు పశుగ్రాసం దొరకడం కష్టంగా మారనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశుగ్రాసం కొరత రాకుండా ఉండేందుకు రూ.42.10 కోట్ల తక్షణ ప్యాకేజీతో పాటు, 64 వేల మెట్రిక్ టన్నుల ఎండుగడ్డి నిల్వ కోసం రూ.44.83 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఎల్నినో దెబ్బకు రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుంటున్న వేళ.. తాగునీరు, పశుగ్రాస సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ప్రజల దాహార్తి తీర్చడానికి, మూగజీవాలను కాపాడటానికి సర్కార్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుందో త్వరలోనే స్పష్టత రానుంది.


