తెలంగాణ

TG: తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎకరానికి రూ.10 వేల సాయం దిశగా సర్కార్!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TG: ఆకాశం వైపు కళ్లప్పగించి చూసిన రైతు కంట ఇప్పుడు కన్నీరే మిగిలింది. వరుణుడు ముఖం చాటేయడం, దానికితోడు ఎల్‌నినో ప్రభావం తోడవడంతో తెలంగాణ పల్లెల్లో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతికందే దశలో పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.18 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది.

TG: ఆకాశం వైపు కళ్లప్పగించి చూసిన రైతు కంట ఇప్పుడు కన్నీరే మిగిలింది. వరుణుడు ముఖం చాటేయడం, దానికితోడు ఎల్‌నినో ప్రభావం తోడవడంతో తెలంగాణ పల్లెల్లో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతికందే దశలో పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.18 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.

పత్తి రైతు నడ్డి విరిచిన వర్షాభావం

ఈ వానాకాలం సీజన్‌లో వానలు సరిగ్గా పడకపోవడంతో పత్తి రైతులు నిండా మునిగిపోయారు. దెబ్బతిన్న మొత్తం 11.18 లక్షల ఎకరాల్లో ఏకంగా 8.93 లక్షల ఎకరాలు పత్తి పంటదే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే పాడైపోయిన పంటల్లో దాదాపు 80 శాతం పత్తే. మరో 3 లక్షల ఎకరాలకు పైగా చేలు వాడిపోతుండగా, దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి బూడిదయ్యాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 3.59 లక్షల ఎకరాల్లో చేలు ఎండిపోగా, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణమే భారీగా తగ్గిపోగా, అందులోనూ వరి నాట్లు ఏకంగా 18 శాతం పడిపోయాయి.

117 మండలాల్లో కరవు విలయం.. రంగంలోకి సర్కార్

వర్షాలు పడకపోవడం, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో రాష్ట్రంలోని 621 మండలాలకు గాను 117 మండలాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వీటిని కరవు ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్ర బృందాలను రప్పించి నష్టాన్ని అంచనా వేయించాలని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించారు. రైతులను ఆదుకునేందుకు మొత్తం రూ.2,170 కోట్ల భారీ ప్యాకేజీ అవసరమని లెక్క తేల్చారు. ఇందులో పంట నష్టపరిహారంతో పాటు విత్తన రాయితీలు, డ్రిప్ ఇరిగేషన్, పశువుల దాణా, గ్రామీణ తాగునీటి అత్యవసర ఏర్పాట్లు ఉన్నాయి. అత్యవసర తాగునీటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ.కోటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.

యాసంగిపైనా పిడుగు.. పల్లెల్లో ఉపాధి పనులే దిక్కా

ఎల్‌నినో ఎఫెక్ట్ డిసెంబర్ నాటికి మరింత ముదిరే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఖరీఫ్ మాత్రమే కాదు, రాబోయే యాసంగి (రబీ) సీజన్ కూడా తీవ్రంగా దెబ్బతినేలా ఉంది. నీళ్లు లేక వచ్చే సీజన్‌లో సాగు విస్తీర్ణం దాదాపు 30 శాతం వరకు పడిపోవచ్చని, ముఖ్యంగా వరి సాగు సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ పనులు తగ్గితే పల్లెల్లో కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది కాబట్టి, ఉపాధి హామీ పథకం కింద మార్చి నాటికి 11 కోట్ల పనిదినాలు కల్పించి ఆదుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ప్రకృతి కన్నెర్ర చేసిన వేళ.. ప్రభుత్వం ప్రకటించబోయే ఎకరానికి రూ.10 వేల సాయం, కరవు సాయం రైతులకు ఎంతవరకు ఊరటనిస్తుందో చూడాలి.

#Telangana#El Nino Effect#Telangana Drought#Farmer Compensation#Rs 10000 Per Acre#Crop Damage#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి