Suspension: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కోతలపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అధికారుల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కీలక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. వైటీపీఎస్ స్టేజ్ వన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పై టీజీ జెన్ కో చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ జెన్ కో సీఎండీ హరీశ్ ఆదేశాలు జారీ చేశారు. ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు సీఎండీ హరీశ్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణలో లోపాలు, పనుల పురోగతిపై సమన్వయ లోపాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
800 మెగా వాట్ల యూనిట్ 1 ను గత 10 నుంచి 15 రోజులుగా విద్యుత్ ఉత్పత్తి లేకుండా షట్ డౌన్ చేసి జనరేషన్ లాస్ కు కారణం అయ్యారని, సిబ్బందిని సమన్వయం చేయడం, పెండింగ్ పనులు పూర్తి చేయడంలో, సమీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారని సురేశ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జెన్ కో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గత నెలలో కూడా ఆయిల్ స్టాక్స్ సరిగా మెయింటైన్ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి.
విద్యుత్ ఉత్పత్తి, నిర్మాణ పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో పలు లోపాలు గుర్తించిన అధికారులు సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. బొగ్గు సరఫరా, రైల్వే వ్యాగన్ల నుంచి బొగ్గు అన్ లోడింగ్, కన్వెయర్ బెల్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారించిన టీజీ జెన్ కో సీఎండీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు.
కాగా, రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు, అంతరాయాలపై సీఎం రేవంత్ ఫుల్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన, పరిస్థితిలో వెంటనే మార్పు రాకపోతే ఉన్నతాధికారులను సైతం సస్పెండ్ చేస్తానని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలని తేల్చి చెప్పారు. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు తేల్చి చెప్పారు. కాగా, విద్యుత్ లో అంతరాయాల కారణంగా సరైన సమయంలో నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ స్పందించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాపై కీలక ఆదేశాలు ఇచ్చారు.


