రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. గత పదేళ్ల పాలనలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం ఒక 'జేబు సంస్థ'గా మార్చుకుందని విమర్శించారు.
అంతేకాకుండా, సింగరేణికి సంస్థకు భారీగా బకాయిలు పెట్టారని, సంస్థను ఆర్థికంగా దెబ్బతీసింది కూడా గత కేసీఆర్ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు.అలాంటి బీఆర్ఎస్ నాయకులకు నేడు సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.సింగరేణి సంస్థను దెబ్బతీసి, దానికి చెడ్డపేరు తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు, విమర్శలు మానుకోవాలని సూచించారు.
గులాబీ నేతలు చేసే తప్పుడు విమర్శలను ప్రజలు, సింగరేణి కార్మికులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని కాపాడిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా సంస్థ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను కూడా పూర్తి స్థాయిలో నడిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.కాగా, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయకుండా సింగరేణిని నిర్వీరం చేయాలని, ప్రయివేటీకరించాలని రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది.


