మాదకద్రవ్యాలకు అలవాటై యువతరం తప్పుదారి పడుతోంది. క్షణికసుఖాల కోసం మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు. కుటుంబాలకు దూరమై డబ్బులు లేక దొంగతనాలు, నేరాలు చేయడం, డ్రగ్స్ విక్రయించడం వంటి అక్రమ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. డ్రగ్స్‌కు బానిసై నేరాలు చేసి జైలుకు వెళ్తున్న వారిలో అధికశాతం యువతే ఉన్నట్టే పోలీసు రికార్డులు చెబుతున్నాయి. డ్రగ్స్ తీసుకుని, సరఫరా చేస్తూ పట్టుబడిన వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, తాజా మత్తుకు బానిసైన ఓ యువతి చేసిన సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డ్రగ్స్ సరఫరా దందా చేస్తూ ప్రియురాలు పోలీసులకు చిక్కింది. విజయవాడ - పటమటకు చెందిన నాగసౌమ్య, ఆమె ప్రియుడు కాశీవర్ధన్ ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలు అయ్యారు. మూడు నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ కాశీవర్ధన్ పోలీసులకు చిక్కాడు.
అతన్ని విడిపించేందుకు డబ్బులు లేక, కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆ కమీషన్ డబ్బులను నాగసౌమ్య కూడబెడుతోంది.ఈ క్రమంలో కృష్ణలంకకు చెందిన బషీర్ రూ.50 వేలు కమీషన్ ఇస్తానని అనడంతో బెంగళూరుకు వెళ్లి 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. బెంగళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్‌లో నాగసౌమ్య తిరిగి విజయవాడ రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.అనంతరం పరారీలో ఉన్న బషీర్‌ను కూడా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, డ్రగ్స్‌కు బానిస అవ్వడంతో పాటు ప్రియుడిని విడిపించేందుకు ఏకంగా బెంగళూరుకు ఒంటరిగా వెళ్లి డ్రగ్స్ సరఫరా దారులను కలిసి మత్తు పదార్ధాలు తీసుకొచ్చిన నాగసౌమ్య గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే ధైర్య సాహసాలు కుటుంబం కోసం చదువు,ఉద్యోగం కోసం చూపించాల్సి అని కొందరు అభిప్రాయపడుతున్నారు.


