సర్కార్పై మరో నిర్మాణ సంస్థ ఆరోపణలు
రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్.. ఆందోళనలో కాంట్రాక్టర్లు
బిల్లులు చెల్లించాలంటే 15శాతం కమీషన్ డిమాండ్!
టెండర్లు వేయొద్దంటూ కాంట్రాక్టర్లకు బెదిరింపులు?
తనకు నచ్చిన వారికే టెండర్ల కేటాయింపు
షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ నామా రమేశ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కాంట్రాక్టర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరి, టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలపై నిర్మాణ రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. ఇటీవల రేడియల్ రోడ్ల (HGCL) టెండర్ల అవినీతిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణల వివాదం ముగియకముందే, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ (RVM Constructions) మేనేజింగ్ డైరెక్టర్ నామా రమేశ్ "బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా" (BAI) అధ్యక్షుడికి రాసిన సంచలన లేఖ బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.
35 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని విపరీతమైన అవినీతి
నిర్మాణ రంగంలో తనకు ఉన్న 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఎన్నడూ చూడని విపరీతమైన అవినీతి ధోరణిని ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నానని నామా రమేశ్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్జీసీఎల్ (HGCL) ఇటీవల చేపట్టిన 'రేడియల్ రోడ్-2' పరిధిలోని మూడు ప్యాకేజీల టెండర్లలో ఎన్సీసీ, బీవీఎస్ఆర్, జీకేసీ, సుశీ ఇన్ఫ్రా వంటి ప్రముఖ సంస్థలు పాల్గొనగా, సుశీ ఇన్ఫ్రా కంపెనీని లక్ష్యంగా చేసుకుని కావాలనే టెండర్ల నుంచి తప్పించారని ఆరోపించారు. సాధారణంగా ఈ తరహా ప్రాజెక్టులకు 10 నుంచి 12 కంపెనీలు బిడ్డింగ్ వేస్తాయని, కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి హెచ్చరిక ఫోన్ కాల్స్ రావడం వల్ల కేవలం నాలుగే కంపెనీలు పాల్గొన్నాయని వివరించారు.
సీఎం పర్యవేక్షణలోనే ముందస్తు ఒప్పందాలు?
సీఎం రేవంత్ రెడ్డి తనకు నచ్చిన కంపెనీలతో ముందస్తుగా మ్యాచింగ్ (Pre-arranged) చేసుకుని, వారికే టెండర్లు కట్టబెడుతున్నారని నామా రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మిగతా సంస్థల కంటే రూ.600కోట్లు తక్కువ ధరకు (L1 కంటే తక్కువ) బిడ్ దాఖలు చేసిన సుశీ ఇన్ఫ్రాను నిబంధనల పేరుతో తిరస్కరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పైగా ప్రస్తుత ఎల్1 (L1) బిడ్డర్లు అంచనా వ్యయం కంటే 3శాతం నుంచి 15శాతం ఎక్కువ మొత్తానికి కోట్ చేశారని, దీనిపై అసలు పారదర్శకతే లేదని, రాజకీయ ఒత్తిళ్లతోనే టెండర్లు ముగిస్తున్నారని స్పష్టం చేశారు.
15 శాతం కమీషన్లు, రూ.20,000 కోట్ల పెండింగ్ బిల్లులు
ఈ టెండర్ల దందా మాత్రమే కాకుండా రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యంగా మారిందని ఆరోపించారు. గత మూడేళ్లుగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారని, ఎవరు 15శాతం కమీషన్లు ఇస్తారో వారి బిల్లులు మాత్రమే మంజూరు చేస్తున్నారని సంచలన నిజాలు బయటపెట్టారు. బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రాష్ట్రంలో పలువురు కాంట్రాక్టర్లు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు.
మౌఖిక ఆదేశాలతో పనుల నిలిపివేత, కాంట్రాక్టర్ల ఆందోళన
మరోవైపు కాంట్రాక్టర్ల పాత బిల్లులు చెల్లించకుండా కొత్త టెండర్లు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా సీఎం మౌఖిక ఆదేశాలు (Oral Instructions) ఇచ్చారంటూ అధికారులు ఐవీఎన్ఎమ్ (IVNM), ధోబీఘాట్, వైకుంఠధామం వంటి అనేక అభివృద్ధి పనులను మధ్యలోనే నిలిపివేశారని, ఈ ప్రాజెక్టులను కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా? అనే స్పష్టత ఇవ్వకుండా ఇఎస్డీ, పీబీజీలను పొడిగించాలని నోటీసులు ఇస్తూ కాంట్రాక్టర్లను తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.
పారదర్శక టెండరింగ్ కోసం బిల్డర్స్ అసోసియేషన్కు విజ్ఞప్తి
ఈ పరిస్థితుల దృష్ట్యా కాంట్రాక్టర్లందరి ప్రయోజనాలను కాపాడటానికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) తక్షణమే జోక్యం చేసుకోవాలని నామా రమేశ్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా సమయానికి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీలకు టెండర్లు కట్టబెట్టే పద్ధతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ప్రతీ అర్హత కలిగిన కాంట్రాక్టర్కు సమాన అవకాశం లభించేలా పారదర్శకమైన టెండర్ విధానం కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.


