రాష్ట్రంలో మరోసారి తెలంగాణ ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. మనకు న్యాయపరంగా దక్కాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎన్నో బలిదానాలకు ఓర్చి సాధించిన స్వరాష్ట్రంలోనూ స్థానిక ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగైతే ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోందని చెబుతున్నారు. పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పైస్థాయిలో ఇప్పటికీ ఆంధ్రా అధికారులే పెత్తనం చెలాయిస్తున్నట్టు తెలిసింది.
రిటైర్మెంట్ అయినా కుర్చీ వదట్లేదు..
తెలంగాణలోని పలు కీలక శాఖలు, సంస్థల్లో ఉన్నతాధికారులు ఆంధ్రా వారే ఉన్నట్టు తెలిసింది. డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వారు రిటైర్మెంట్ అయినా కుర్చీ వదలకుండా తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేసి అక్కడే కొనసాగుతున్నట్టు సమాచారం. ఫలితంగా కిందిస్థాయి తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కడం లేదు. కథనాల ద్వారా విషయం బయటకు వస్తే సీఎంవో స్థాయి అధికారులు వారిని పంపించి వేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా శాఖల్లో వేలు పెడుతూ తమకు కావాల్సిన వారికి పనులు చేసి పెడుతున్నట్టు సమాచారం. అందుకు పొలిటికల్ లీడర్స్ సైతం సహాయసహకారాలు అందిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కాంట్రాక్టులూ వారికే..
వివిధ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచే టెండర్లలో మెజార్టీ వాటాను ఆంధ్రా కాంట్రాక్టర్లు దక్కించుకుంటున్నట్టు స్థానిక కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి పైస్థాయిలోని అధికారులు వారికే కట్టబెడుతున్నట్టు మండిపడుతున్నారు. ఎంత టెండర్ కోట్ చేయాలని వారికే ముందు సమాచారం వెళ్తుందని, జీహెచ్ఎంసీ మొదలు పలు కీలక శాఖల్లో పెండింగ్ బిల్లులు విడుదల సమయంలోనూ వారికే ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రా కాంట్రాక్టర్లకే ముందుగా బిల్లులు విడుదల అవుతున్నాయని, తీరా లోకల్ వారికి బిల్లులు చెల్లించే సమయానికి బడ్జెట్ లేదని, ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ రాలేదని అంటున్నారని వాపోతున్నారు. కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు కూడా ఆపేస్తున్నారని చర్చ జరుగుతోంది. నాడు బీఆర్ఎస్ సమయంలోనూ కాంట్రాక్టులు అన్ని ఆంధ్రావాళ్లకే కట్టబెట్టారని విమర్శించినా కాంగ్రెస్..అధికారంలోకి రాగానే వారి బాటలోనే నడుస్తోందని లోకల్ కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరొకలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

విద్యుత్, ఇరిగేషన్ శాఖలే కీలకం..
రాష్ట్రంలో విద్యుత్, ఇరిగేషన్ శాఖలు చాలా కీలకం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిస్కమ్స్, జలసౌధలో పై స్థాయి అధికారులు,సీనియర్ ఇంజినీర్లు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తమకు కావాల్సిన వారికి పెద్దఎత్తున కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్ల విషయంలోనూ పెద్దఎత్తున ముడుపులు తీసుకుని వారికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టర్ల యూనియన్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల మరమ్మత్తులు, బొగ్గు సరఫరా, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల ప్రకటనల సమయంలో ఆంధ్రా అధికారులు, కాంట్రాక్టర్లే చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించినా ఇక్కడి అధికారులకు ప్రమోషన్లు రావడం లేదు. కాంట్రాక్టర్లు సైతం బిల్లులు రాక, కమీషన్లు ఇచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రం మనది అన్న ఫీలింగ్ తప్పా మనుషులు మనవాళ్లు కాదనే భావనలో ఇక్కడి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి బాధ్యులపై చర్యల్లోనూ వివక్ష..
తాజాగా నిన్న జరిగిన ఓ పరిణామం తెలంగాణ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు ఎంతటి తీరని అన్యాయం జరుగుతుందో, సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.రాష్ట్రంలో కరెంటు కోతలు, విద్యుత్ సంస్థల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం, కరెంటు కోతలపై సీఎం అధికారుల మీద సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ వ్యాఖ్యలతో విద్యుత్ సంస్థలలో పనిచేసే ఇంజినీర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

తెలంగాణ అధికారులను బలి చేస్తూ ఆంధ్రా అధికారులకు అందలం వేస్తారా? అంటూ ఇంజినీర్ల సంఘాలు మండిపడుతున్నాయి. వైటీపీఎస్ స్టేజ్ 1 సీఈ సురేష్ను జెన్కో సీఎండీ సస్పెండ్ చేసినట్టు తెలిసింది. బొగ్గును సరైన సమయంలో అందించకపోగా అధికారులను ఎలా బలి చేస్తారంటూ విద్యుత్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైటీపీఎస్ స్టేజ్ 2లో కూడా లోపాలు ఉన్నాయి కదా? స్టేజ్ టూ సీఈ సూర్యనారాయణ ఆంధ్రా వ్యక్తి కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యుత్ సంఘాలు ఆరోపిస్తున్నాయి.మొత్తం పవర్ ప్లాంట్ ఇన్చార్జ్ టీపీసీ (థర్మల్ పవర్ కన్స్ట్రక్షన్) సీఈగా ఉన్న పీవీ శ్రీనివాస్ రావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి.
బొగ్గు లేకపోతే అధికారులు ఏం చేస్తారు?
జెన్కోలో ఉత్పత్తికి బాధ్యత వహించాల్సిన థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశాయి.అసలు బొగ్గు లేకపోతే సీఈగా ఉన్న సురేష్ ఏం చేస్తాడు? థర్మల్ డైరెక్టర్, జెన్కో యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ ఉద్యోగులు, ఇంజినీర్లు ఎలా బాధ్యులు అవుతారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఉత్పత్తి చేయడానికి బొగ్గు లేకపోతే అధికారులు ఏం చేస్తారు? కీలకమైన విద్యుత్తు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రా ఇంజినీర్లను వెంటనే బదిలీ చేయాలని విద్యుత్ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వారి డిమాండ్లను సర్కారు పెద్దలు పట్టించుకోవడం లేదని తెలిసింది.


