రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా అవినీతికి మాత్రం అంతం ఉండటం లేదు. ఒకవైపు లంచాల భూతం పట్టిపీడిస్తుండగా.. మరోవైపు ప్రతి శాఖలో రోజుకో కొత్త కుంభకోణం భయటపడటం చర్చంశనీయంగా మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుంభకోణాలకు నిలయం అనే ఆరోపణలున్నాయి. కానీ బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ రెడ్డి చేసిన పోరాటంతో ప్రజల్లో నెలకొన్న ఆశ.. మళ్ళీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం ఇచ్చింది..
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక రాష్ట్రంలో ప్రతి శాఖలో తవ్వుతున్న కొద్ది అవినీతి లుకలుకలు బయటపడటం.. మళ్ళీ కాంగ్రెస్ పాలనపై గతం తాలూకు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రేవంత్ సర్కార్ నిర్ణయాలపై పలు విమర్శలు ఎదురవుతున్న వేళ.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా ధనం లూటీ చేస్తున్న కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. శానిటేషన్ విభాగం కేంద్రంగా పలువురు బినామీ ఉద్యోగులు ఆ శాఖలో ఉన్నట్టు తేలడం ప్రస్తుతం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తీసుకుంటున్న జీతానికి చెమటోడ్చి కష్టపడుతున్న కార్మికులకు ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాలంటే వంద కారణాలు చెప్పి ఇచ్చే జీతంలోనే కోతలు విధించే ఘనులు ఉన్న ఈ కాలంలో.. నెలలో ఒక్క రోజైనా విధులకు హాజరు కానీ బోగస్ కార్మికులను రికార్డుల్లో ఉద్యోగులుగా చెలామణి చెపిస్తూ.. వేతనాలు కాజేస్తున్నట్టు తేలింది.
ఈ తంతు నిరాటంకంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే కొనసాగుతున్నట్టు ఆరోపణలున్నాయి.. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్తో బినామీల పేరిట జీతాలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే.. పారిశుద్ధ్య పనుల్లో సిబ్బంది కొరత ఉందని అధికారులు అంటుండగా.. రికార్డులు మాత్రం వందలాది మంది కార్మికులు పని చేస్తున్నట్లు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది..
ఇక ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్ లో బోగస్ ఉద్యోగుల వ్యవహారం గతంలో వెలుగులోకి వచ్చింది కదా అని అంతా అనుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందనే ఆరోపణలున్నాయి.. అయితే ఇప్పటికే ఈ బినామీ బాగోతం పూర్తిగా వెలుగులోకి వస్తే తమ బండారం బట్టబయలవుతుందని కొందరు తెరవెనుక పెద్దలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.
ఈ విషయం బయటకు పొక్కితే ఎదురయ్యే పరిణామాలను ముందే ఊహించి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.. మరోవైపు అధికార యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు తెరవెనుక రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖ సిబ్బంది చర్చించుకోవడం కనిపిస్తుంది. ఇన్నాళ్లు ఎవరికీ అంతుచిక్కని ఈ బినామీ దందాలో మరిన్ని విషయాలు బయటికి రావాలంటే.. ఇంకా లోతైన విచారణ చేపట్టవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఆ శాఖ నుండే వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది వేతనాల చెల్లింపు విధానంలో ఇటీవల అధికారులు కీలక మార్పులు చేపట్టారు. కొత్త నిబంధనల మేరకు మహిళా సంఘాల (మెప్మా గ్రూపులు) ద్వారా చెల్లించాలని, బయోమెట్రిక్ (ఫేస్ రికగ్నిషన్) హాజరు ఉన్న వారికే వేతనాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ అంశం తెరపైకి రావడంతోనే బినామీలను కాపాడేవారిలో ఆందోళన పెరిగినట్టు తెలుస్తుంది.
ఇంతవరకు ఏ ఒక్కరోజూ కూడా విధులకు హాజరు అవ్వకుండా ఉన్న బోగస్ ఉద్యోగులకు ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయడం ఎలా సాధ్యమనే తర్జబర్జనలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ వ్యవహారాన్ని బయటికి పొక్కనీయకుండా క్షేత్రస్థాయికి వచ్చి హాజరు వేసినా ఇప్పుడున్న నిబంధనల వల్ల ఈ వెలుగులోకి రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో కఠిన నిబంధనలు గనుక అమలు చేస్తే ఇప్పటివరకు బోగస్ సిబ్బంది పేర్లతో డ్రా అయిన జీతాలకు సంబంధించిన కోట్ల రూపాయల దందా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు భావించిన చీకటి శక్తులు ఈ ప్రక్రియను ఎలాగైనా నీరుగార్చాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
మరోవైపు కార్పొరేషన్లో తిష్టవేసిన బినామీలను పూర్తిగా పెకిలించాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపైనే ఉంది. పారిశుద్ధ్య విభాగంలోని ప్రతి సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తేనే నిజమైన ఉద్యోగులు ఎవరో, బినామీలు ఎవరో తేలుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, కార్పొరేషన్ ఉన్నతాధికారులు స్పందించి బినామీల దందాను కాపాడే శక్తులను, ప్రజాధనం కొల్లగొడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పట్టణ ప్రజలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


