సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఓ యువ టెకీ జీవితం పెళ్లయ్యాక ఛిద్రం అయిపోయింది. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకున్న ఆ యువతి.. వివాహం అనంతరం ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. అత్తింటి వారి నుంచి ఒత్తిడి, వేధింపులు ఎక్కువ అయిపోయాయి.ఓవైపు ఉద్యోగంలో వర్క్ ప్రెజర్.. మరోవైపు అత్తింటి వేధింపులు పెరగడంతో జీవితం మీద విరక్తి కలిగింది. తన బాధను తల్లిదండ్రులకు చెప్పినా వారు ఏమి చేయలేకపోయారు. దీంతో తనువు చాలించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర పూణెలోని కేశవ్నగర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 2018లో రాహుల్ అనే వ్యక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగిని త్రిష్ణకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో త్రిష్ణకు ఆమె తల్లిదండ్రులు 13 తులాల బంగారం ఇచ్చారు . అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి అత్తింటివారు త్రిష్ణను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని ఆమె తండ్రి బాలకృష్ణ నికం(74) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కూతురికి రూ. లక్షల్లో జీతం వచ్చేదని, ఆ మొత్తాన్ని తమకే ఇవ్వాలని, అలాగే తమ పేరిట ఉన్న ఇంటిని అత్త పేరుపై ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడికి గురి చేశారని త్రిష్ణ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.తన పేరిట రూ.1 కోటి విలువ చేసే ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని త్రిష్ణ మామ పట్టుబట్టారని చెప్పారు. అల్లుడు రాహుల్ కూడా తన కూతురిని వేధించాడని, ఆమెను చాలాసార్లు కొట్టాడని.. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి సైతం చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
చివరికి వారి వేధింపులు భరించలేక సెప్టెంబర్ 29వ తేదీన త్రిష్ణ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తండ్రి బాలకృష్ణ కన్నీరుమున్నీరయ్యారు. తన కూతురి మృతికి అత్తింటివారే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. అయితే, గత నెలలో త్రిష్ణ ఆత్మహత్య చేసుకోగా అనారోగ్య సమస్యలతో ప్రాణం తీసుకుందని అందరినీ నమ్మించేందుకు, కేసు నుంచి బయట పడేందుకు అత్తింటి వారు ప్రయత్నించినట్టు సమాచారం. చివరకు బాధిత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.


