రాష్ట్రంలో నెలకొన్న కరెంటు కష్టాలు, తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు.వేసవి రాకముందే రాష్ట్రంలో కోతలు మొదలు అయ్యాయని, ఈ సంక్షోభానికి ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వమే కారణమని స్పష్టంచేశారు.
తప్పులు మీరు చేసి అధికారులపై నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని, అందుకు ప్రభుత్వమే కారణమని వెల్లడించారు. విద్యుత్ రంగంపై సమీక్షలు లేకపోవడంతో కరెంట్ కోతలు వస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారుల సస్పెన్షన్ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని, ఎల్నినో కంటే, కోవిడ్ కంటే మించిన విపత్తు మీ పాలన అంటూ రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్లు వేశారు. అధికారుల ఉద్యోగాల గురించి హెచ్చరించే ముందు.. ప్రజలు, అధికారులు తన ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ను హరీష్ రావు హెచ్చరించారు.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రతరం కావడంతో ప్రజలు, అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సాగుకు నీళ్లివ్వని కాంగ్రెస్ సర్కార్.. మరోవైపు కరెంట్ కోతలు కూడా పెడుతుంటంతో జనరేటర్ల ద్వారా నీళ్లను పొలాలకు పారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్ నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాశయాలు అడుగంటుతున్నాయి. సాగుకు సర్కార్ నీళ్లివ్వకపోవడంతో బావుల ద్వారా నీటిని మోటార్ల ద్వారా మళ్లించాలని రైతులు భావించగా కరెంటు కోతలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో విపరీతంగా కోతలు మొదలు అయ్యాయని తెలుస్తోంది.


