దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానం (FZ1073) కాక్‌పిట్‌లో గత నెలలో జరిగిన సంచలన దాడి కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. విమానాన్ని కూల్చివేసేందుకు పెద్దఎత్తున కుట్ర జరిగిందనే అనుమానాలు బలపడుతున్న తరుణంలో, దుబాయ్ పోలీసులు తాజాగా మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను అరెస్ట్ చేశారు.
మాల్దీవుల వార్తా సంస్థ 'అధాదు' వెల్లడించిన వివరాల ప్రకారం.. గత శనివారమే ఈ అరెస్టులు జరగగా, యూఏఈలోని మాల్దీవుల రాయబార కార్యాలయం వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేసింది. గత సెప్టెంబర్ 30న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మమితో ఈ అరెస్టయిన ఇద్దరు మాల్దీవుల పైలట్లు సన్నిహితంగా పనిచేసినట్లు తేలింది.
ఫ్లైదుబాయ్‌లో మొత్తం ఆరుగురు మాల్దీవుల పౌరులు పైలట్లుగా పనిచేస్తుండగా, అందులో వీరు ఇద్దరు ఉన్నారు. గతంలో వీరు కూడా ఇజ్రాయెల్‌కు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, వీరిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు కాలేదని, దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉందనే కోణంలో దుబాయ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ చూపిన అసాధారణ ధైర్యసాహసాలు ప్రాణాలను నిలబెట్టాయి.
తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆయన ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపులు తెరవడంతో, స్టాండ్‌బై పైలట్లు లోపలికి వచ్చి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి సురక్షితంగా మళ్లించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ 'రియల్ హీరో'గా అభివర్ణించగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రస్తుతం యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ కోలుకుంటున్నారు.


