భారత క్రికెట్ దిగ్గజ ఆల్ రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ ఐపీఎల్లో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కోచ్‌గా తన మొదటి అధికారిక ఐపీఎల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న యువీ, జట్టులో గెలుపు సంస్కృతిని, గట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి ఢిల్లీ ఫ్రాంచైజీకి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందించడమే తన ప్రధాన ధ్యేయమని ధీమా వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా గంగూలీతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ యువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దాదా నన్ను నేరుగా పిలిచి, 'నా అసిస్టెంట్‌గా ఉంటావా?' అని అడిగారు. దానికి నేను నవ్వుతూ.. 'గత 25 ఏళ్లుగా మీకు అసిస్టెంట్‌గానే ఉన్నాను కదా దాదా, బహుశా అదే పనిని ఇప్పుడూ కొనసాగిస్తానేమో' అని సరదాగా అన్నాను. కోచింగ్ పాత్ర కోసం గత 3-4 ఏళ్లుగా సిద్ధమవుతున్న నాకు ఈ బాధ్యతలు దక్కడం ఎంతో సంతోషాన్నిస్తోంది" అని యువీ పేర్కొన్నారు. తన క్రికెట్ కెరీర్ ప్రారంభం నుంచి గంగూలీ ఒక పెద్ద దిక్కుగా నిలిచారని, ఆయన మార్గదర్శకత్వంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అత్యుత్తమ వాతావరణం నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కోచింగ్ శైలి గురించి వివరిస్తూ.. ఐపీఎల్ స్థాయిలో ఆడే ప్రతీ ఆటగాడికి అపారమైన నైపుణ్యం ఉంటుందని, వారిపై ఫ్రాంచైజీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మైదానంలో ఆత్మవిశ్వాసంతో ఆడటమే ముఖ్యమని సూచించారు. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉందని, వారి సామర్థ్యానికి తగ్గట్లుగా రాణించేలా తీర్చిదిద్దుతానని తెలిపారు.
గతంలో 2015 ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లకు ఇదే ఢిల్లీ ఫ్రాంచైజీ (అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరఫున ఆడిన యువరాజ్, ఇప్పుడు మళ్లీ అదే జట్టుకు కోచ్‌గా రావడం విశేషం. కేవలం ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా, సమష్టి కృషి, నాణ్యమైన బౌలింగ్, పటిష్టమైన ఫీల్డింగ్‌తో ఒత్తిడిని జయించి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడమే తమ వ్యూహమని యువరాజ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు కనీసం ఒక్క సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో 2020 సంవత్సరంలో యూఏఈ వేదికగా జరిగిన టోర్నమెంట్లో ఈ జట్టు తొలిసారి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ తుదిపోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి దాదా, యూవీ సారథ్యంలో వచ్చే సీజన్లో ఫైనల్ చేరాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.


