Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలను పండబెట్టావు, నీళ్లు ఇవ్వలేదు అంటూ సీఎం రేవంత్ పై మండిపడ్డారు. మళ్లీ పాలమూరు జిల్లాలో వలసలు మొదలయ్యాయని వాపోయారు. గట్టు మండలం రాయపురం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీశ్ రావు పరిశీలించారు.
'కాంగ్రెసోళ్లు గెలిస్తే రైతుబంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్.. అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, ఇప్పుడు అదే జరిగింది. మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు, రైతు బీమా బంద్ పెట్టారు.. 24 గంటల కరెంట్ 7 గంటలకు వచ్చేసింది.. కేసీఆర్ ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి పెళ్లికి వచ్చింది.. రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది. తులం బంగారం ఇస్తామన్నారు.. అంతా ఉత్తదైపోయిందా.. లేదా..?' అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
''ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పే మాట ఒక్కటే. నిరంజనన్న మీకు అండగా ఉన్నారు. హనుమంతు అద్భుతంగా పని చేస్తున్నాడు. కేశవ్ ఉండనే ఉన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే మీ పక్కనే ఉన్నారు. ఏ ఆపద వచ్చినా మీకు ఎమ్మెల్యే తయారుగా ఉండనే ఉన్నాడు. ఒక్క ఏడాది ఏడాదిన్నర కష్టపడండి. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మాది. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. కచ్చితంగా గద్వాల్లో మీరంతా కోరుకున్న నాయకుడినే ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. దగ్గరుండి గెలిపించుకుందాం. తప్పకుండా మీ అందరి కష్టాలు తీర్చే బాధ్యత మన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తీసుకుందాం'' అని హరీశ్ రావు అన్నారు.


